చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్ట్ సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గతంలో ఏ తప్పూ చేయని జనసేన నాయకులపైనా హత్యాయత్నం కేసులు పెట్టారని గుర్తు చేశారు. చంద్రబాబుపై నంద్యాలలో ఘటనకూడా అలాంటిదేనన్నారు.
“ప్రాథమిక ఆధారాలు కూడా చూపించకుండా అర్థరాత్రులు అరెస్టు చేసే విధానాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అవలంభిస్తున్నారు. గతేడాది అక్టోబరులో విశాఖపట్నంలో మా పార్టీ పట్ల పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో ప్రజలందరూ చూశారు. హత్యాయత్నం కేసులుపెట్టి మా జనసేన నాయకులను జైళ్ళలో పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి పట్ల నంద్యాలలో వ్యవహరించిన విధానం కూడా అలాంటిదే. ఆయన అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నాం. అప్రజాస్వామిక పాలనకు అద్దంపడుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని జనసేన భావిస్తోంది. ప్రతిపక్షాలను అణచివేయాలనే వైసీపీ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సైతం చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును ఖండించారు. ” ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది” అని ట్వీట్ చేశారు.