పవన్ కల్యాణ్ తన కెరియర్లో మొదటిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథను ఎంచుకున్నాడు .. అదే ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాను ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తుంటే, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో నడిచే కథ కావడంతో, ఆనాటి కాలానికి సంబంధించిన సెట్స్ కోసం భారీస్థాయిలో ఖర్చు చేశారు. కథా పరంగా గుర్రాలు .. ఛేజింగులు గట్రా ఉండటంతో, వాటి కోసం కూడా పెద్దమొత్తంలోనే ఖర్చు చేశారు. అలా 50 శాతానికి మించి చిత్రీకరణ జరుపుకుంది.
ఆ తరువాత అడపా దడపా పవన్ ను క్రిష్ – రత్నం కలిసి ఈ ప్రాజెక్టును గురించి చర్చించడం, ఈ సినిమా సెట్స్ లో పవన్ కొన్ని రోజుల పాటు కనిపించడం జరుగుతూ వచ్చింది. అలా మరికొంత షూటింగును కానిచ్చారు. కానీ ఎందుకనో ఒక ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా షూటింగు జరగడం లేదనే ఒక సందేహం మాత్రం అభిమానులకు వచ్చేసింది. అసలు ఏం జరుగుతుందనేది కూడా వాళ్లకి అయోమయాన్ని కలిగిస్తోంది. ఒక చారిత్రక నేపథ్యం కలిగిన భారీ సినిమా, సెట్స్ పై అప్పుడప్పుడు కనిపిస్తే ఎప్పటికి పూర్తయ్యెను? అనేది వాళ్ల టెన్షన్.
పవన్ బిజీగా ఉండటం వలన డేట్స్ దొరకడం లేదని కొన్నాళ్లు .. ఆర్ధిక పరమైన ఇబ్బందుల వలన షూటింగు ఆగిపోయిందని కొన్నాళ్లు వార్తలు షికారు చేశాయి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ వేరే ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. వాటిలో తక్కువ బడ్జెట్ లోనివి .. భారీ బడ్జెట్ లోనివి కూడా ఉన్నాయి. ‘వీరమల్లు’ఆలస్యానికి గల కారణాలను గురించి మేకర్స్ మౌనంగానే ఉంటూ వస్తున్నారు. పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమా అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.