Saturday, January 18, 2025
HomeTrending Newsహీరో స్మగ్లింగ్ చేస్తున్నాడు..: అల్లు అర్జున్ పై పవన్ పరోక్ష వ్యాఖ్యలు

హీరో స్మగ్లింగ్ చేస్తున్నాడు..: అల్లు అర్జున్ పై పవన్ పరోక్ష వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్…ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈరోజు పవన్ బెంగుళూరులో పర్యటించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంతో పాటు ఏపీలో పంట పొలాలను నాశనం చేస్తోన్న ఏనుగుల మందను తరమడానికి 8 కుంకీ ఏనుగులను ఇవ్వాలంటూ కర్నాటక ప్రభుత్వాన్ని కోరేందుకు వెళ్ళారు. ఉదయం ఆ రాష్ట్ర సిఎం సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్న పవన్.. సాయంత్రం అక్కడి అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖంద్రాతో భేటీ అయ్యారు. అనంతరం ఇరు రాష్ట్రాల మంత్రులూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ అన్ని రంగాల్లో లాగే సాంస్కృతిక రంగంలోనూ మార్పులు వచ్చాయని.. 40 ఏళ్ళ క్రితం సినిమాల్లో హీరో అడవులను, చెట్లను కాపాడే పాత్రలు పోషించేవారని… కానీ ఇప్పటి సినిమాల్లో హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్ర పోషిస్తున్నారని… ఇది ప్రస్తుత మన సినిమా పరిస్థితి అంటూ అల్లు అర్జున్ పోషించిన పుష్ప సినిమా పాత్రను పరోక్షంగా ప్రస్తావించారు. తనకు ఎప్పుడైనా అలాంటి పాత్రలు వస్తే చేయడానికి ఎంతో ఇబ్బంది పడతానన్నారు.

ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చివరిరోజున అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్ధి శిల్పా రవికిషోర్ రెడ్డిని గెలిపించాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురంలో పవన్ ఇంటికి వచ్చారు. స్వయంగా తన మామ వరుసైన పవన్ వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో దానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి మద్దతివ్వడంపై మెగా ఫ్యామిలీ కినుక వహించింది. నాగబాబు ఈ విషయమై బహిరంగానే ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటినుంచీ  మెగా- అల్లు కుటుంబాల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతింది.

ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి పవన్ డిప్యూటీ సిఎం అయ్యారు. అల్లు అర్జున్ మద్దతిచ్చిన రవికిషోర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

సినీ ప్రముఖులతో పాటు అల్లు అరవింద్ విజయవాడ వెళ్లి పవన్ తో సమావేశం అయ్యారు. విడిగా కూడా ఆయన్ను కలిశారు కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఈ విభేదాల వల్లే పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా అర్ధంతరంగా నిలిచిపోయిందనే సమాచారం కూడా ఫిలిం నగర్ సర్కిళ్లలో ఉంది.

తాజాగా పవన్  చేసిన ఈ వ్యాఖ్యలతో మెగా-అల్లు కుటుంబాల మధ్య దూరం మరింత పెరుగుతుందేమోనని  ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్