Sunday, January 19, 2025
Homeసినిమాపవన్ ఒక పేరు కాదు... బ్రాండ్

పవన్ ఒక పేరు కాదు… బ్రాండ్

Pawan Kalyan, is not a name, its a Brand…..టాలీవుడ్లో పవన్ అంటే ఒక పేరు కాదు .. ప్రభంజనం. యూత్ లో ఆయనకి గల క్రేజ్ కి ఆకాశమే సరిహద్దు. దూకుడుకి .. ధైర్యానికి .. సాహసాలకి .. ప్రయోగాలకి ఆయన పేరు ప్రత్యామ్నాయం. ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది .. ఎవరూ అనుకరించలేని బాడీ లాంగ్వేజ్ ఉంది. తెరపైకి వస్తూ వస్తూనే ఆయన కాస్ట్యూమ్స్ విషయంలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. పవన్ వచ్చింది మెగా ఫ్యామిలీ నేపథ్యం నుంచి. అలాంటప్పుడు ఎవరైనా సరే ఆయన నుంచి ఒక రేంజ్ సినిమాను ఊహిస్తారు .. అంచనాలు పెంచుకుంటూ వెళతారు.

కానీ పవన్ మొదటి సినిమా నుంచే తన ప్రత్యేకతను చాటుకున్నారు. సాధారణంగా ఆ స్థాయి నేపథ్యం నుంచి వచ్చే హీరోలు భారీ బడ్జెట్ తో కూడిన మాస్ మసాలా యాక్షన్ కథలను ఎక్కువగా ఎంచుకుంటారు. అందునా పవన్ కి మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం ఉండటం వలన ఆ తరహా జోనర్ లో సినిమా చేసే ఆలోచన చేయవచ్చు. కానీ ఆయన చాలా సింపుల్ గా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఆయన తొలి సినిమాగా ఎంచుకోవడం విశేషం.

ఆ తరువాత పవన్ ‘గోకులంలో సీత’ .. ‘సుస్వాగతం’ సినిమాలు చేశారు. ఈ సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో రూపొందినవే. ఈ రెండు సినిమాలు హిట్ కొట్టినప్పటికీ, నటన పట్ల పవన్ కి గల కొత్తదనం .. బిడియం కనిపిస్తూనే ఉంటాయి. ఆ తరువాత వచ్చిన ‘తొలిప్రేమ’ .. ‘తమ్ముడు’ సినిమాలు పవన్ ను యూత్ కి మరింత చేరువగా తీసుకెళ్లాయి. ఆయన కెరియర్ కి ఈ సినిమాలు ఎంతో హెల్ప్ అయ్యాయి. అలా యూత్ కి నచ్చే సినిమాలు మాత్రమే చేస్తూ వెళుతున్న పవన్ కి, మాస్ ఆడియన్స్ నుంచి కూడా మార్కులు పడేలా చేసిన సినిమా ‘బద్రి’.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ ను ఒక ఊపు ఊపేసింది. పవన్ స్టైల్ .. బాడీ లాంగ్వేజ్ ఈ సినిమా నుంచే పూర్తిగా మారిపోయాయని చెప్పాలి. యూత్ లో ఈ సినిమా ఆయన క్రేజ్ ను అమాంతంగా పెంచడమే కాకుండా, మాస్ ఆడియన్స్ కి ఆయనను చేరువ చేసింది. ఆ తరువాత వచ్చిన ‘ఖుషీ’ .. ‘జల్సా’ కూడా అదే బాటలో నడిచాయి. కాలేజ్ కుర్రాళ్లంతా పవన్ ను ఆరాధించడం .. ఆయన స్టైల్ ను అనుకరించడం పెరిగిపోతూ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే యూత్ లుక్ ను ఆయన ఒక్కసారిగా మార్చేశారు.

ఈ నేపథ్యంలోనే ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చింది. మొదటి నుంచి కూడా పోలీస్ గెటప్పులు .. తుపాకులు .. గుర్రాలు అంటే ఎంతో ఇష్టపడే పవన్, ఈ పాత్రలో రెచ్చిపోయారు. ఇక ‘కాటమరాయుడు’ సినిమాతోను ఆయన మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించారు. ఆ వెంటనే మళ్లీ ‘అత్తారింటికి దారేది’ .. ‘గోపాల గోపాల’ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తూ అన్నివర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. ‘గోపాల గోపాల’ సినిమాలో మోడ్రన్ కృష్ణుడిగా బుల్లెట్ నడిపినా ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోవడం ఆయన క్రేజ్ కి నిదర్శనం.

కథ ఏదైనా .. దర్శకుడు ఎవరైనా .. ఆయన సినిమాలు ఫస్టులుక్ దగ్గర నుంచి ఫస్టు డే వసూళ్ల వరకూ కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంటాయి. ఆయన సినిమా పరాజయం పాలైనా ఆ తరువాత సినిమా బిజినెస్ పై అది ఎలాంటి ప్రభావం చూపించకపోవడం విశేషం. రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన కొంత గ్యాప్ తరువాత ‘వకీల్ సాబ్’ చేశారు. అయినా ఈ సినిమా కూడా పాత రికార్డులను తుడిచేసి ఆయన ఛరిష్మా ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఎంటర్టైన్మెంట్ కి దూరంగా కథ నడిచినా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

పవన్ కి దర్శకత్వం పై కూడా మంచి అవగాహన ఉంది .. ‘జానీ’ సినిమా ఆయన దర్శకత్వంలో వచ్చిందే. ఇక తన సినిమాల్లో డూప్ లేకుండా ఆయన రిస్కీ ఫైట్లు చేస్తుంటారు .. కొన్నిసార్లు తన ఫైట్లు తనే కంపోజ్ చేస్తుంటారు. అంతేకాదు తన సినిమాల్లో అప్పుడప్పుడు పాటలు కూడా పాడేస్తుంటారు. ప్రస్తుతం ఆయన తన కెరియర్లోనే తొలిసారిగా ‘హరి హర వీరమల్లు’ అనే చారిత్రక చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే ‘భీమ్లా నాయక్’ అనే మరో సినిమా చేస్తున్నారు. అంతేకాకుండా హరీశ్ శంకర్ తో .. సురేందర్ రెడ్డితో ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ పవన్ ఎప్పుడూ కూడా చిరంజీవిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకుని .. తనకి నచ్చిన కథలతో ముందుకు వెళ్లారు. తక్కువ సినిమాలతో ఎక్కువగా ప్రేక్షకులను ప్రభావితం చేసిన హీరోల జాబితాలో పవన్ కనిస్తారు. ఈ రోజున (సెప్టెంబర్ 2) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం .. మరెన్నో విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం.

(పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్