వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ అంకెలు తారుమారు అయి 15 సీట్లకు పడిపోవచ్చని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని, జనసేన డంకా బజాయించబోతోందని వెల్లడించారు. వైసీపీకి మరీ సున్నా సీట్లు వస్తాయని తాను చెప్పడంలేదని వ్యంగ్యంగా అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవలి స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
పదునైన వ్యూహాలతో రాబోయే ఎన్నికలు ఎదుర్కొని తామెంతో చూపిస్తామని, తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెడతామని పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతలు అధికారానని అడ్డం పెట్టుకొని జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెడితే చిట్టా రాసుకొని తర్వాత వారి సంగతి చెబుతామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య బద్ధంగానే ఎదుర్కొంటామని, ఎలాంటి యుద్ధానికైనా తాము సిద్ధమని అయన తేల్చి చెప్పారు. కులం ప్రధానం కాదని, గుణం ప్రధానమని వచ్చే ఎన్నికల్లో ఈ విషయాన్ని వచ్చే ఎన్నికల్లో తెలియజెబుతామన్నారు. ప్రభుత్వ విధానాలపై తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నారని, కుక్కల్లా అరుస్తున్నారని పవన్ మండిపడ్డారు.
వైసీపీ దుష్ట పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నానని, భవిష్యత్తులో కూడా చెబుతూనే ఉంటానన్నారు. వైసీపీ నాయకత్వానికి సవాల్ చేస్తున్నానని, ‘మీరో నేనో తేల్చుకుందాం రండి’ అంటూ ఛాలెంజ్ విసిరారు. వైసీపీని రాష్ట్రం నుంచి బైటకు పంపే రోజు దగ్గరోనే ఉందన్నారు. వైసీపీ వ్యక్తులకు భయం లేకుండా లేదని, భయం అంటే ఏమిటో నేర్పిస్తానని వ్యాఖ్యానించారు.
తనను గెలిపిస్తే రాష్రంలో అభివృద్ధి అంటే ఏమిటో, శాంతి భద్రతలు ఎలా ఉండాలో చూపిస్తామన్నారు. ఆడబిడ్డలను ఎవరైనా కన్నెత్తి చూడాలంటేనే భయపడాలని పవన్ అన్నారు.