టిడిపి ఎంపీలు కోవర్టులుగా మారి బిజెపిలో చేరారని, వారి ఆధ్వర్యంలోనే బద్వేల్ ఉపఎన్నికలో బిజెపి పోటీ చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. బద్వేలు మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. బిజెపి నేతల మాటలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ జగన్ అమలు చేసున్నారని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. బద్వేల్ లో లక్షకు పైగా మెజార్టీ సాధించేలా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.
సిఎం జగన్ నేతృత్వంలో బద్వేల్ లో 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని డిప్యూటీ సిఎం అంజాద్ భాషా అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. వ్యవస్థలో మార్పు తీసుకు వస్తున్నామని, వైసీపీకే ఎందుకు ఓటు వేయాలో వివరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు అమలు చేయడంలో బిజెపి విఫలమైందని, దీనిపై కూడా ప్రజలకు అవగాహన కలిగించాలని కోరారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీగోవింద రెడ్డి, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, బద్వేలు అభ్యర్థి డాక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు.