Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాలం చెక్కిన పెన్సిల్

కాలం చెక్కిన పెన్సిల్

The Philosophy of Pencil Collection :

“నా సేకరణలన్నింటికీ వారసురాలు నా కూతురే. ఏదో ఒక ఏడాదో రెండేళ్ళో కాదు సేకరణ అంటే….ఎన్నో ఏళ్ళుగా సేకరిస్తూ వచ్చాను. మొదట్లో మా నాన్న వెతికి వెతికి నాకోసం ఎంతో శ్రమపడి సేకరించారో మాటల్లో చెప్పలేను. అవన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి. మరికొంత కాలానికి అవన్నీ నా కుమార్తెకు అప్పగిస్తాను తను ఆశ్చర్య పోయేలా.

ఇంతకీ ఏమిటా సేకరణో చెప్పలేదు కదూ!
ఆ సేకరణ మరేమిటో కాదు, పెన్సిళ్ళు!!

ఉన్నట్టుండి నా దగ్గరున్న పెన్సిళ్ళు నా కూతురుకి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడిక్కడ స్కూలు రోజుల్లో నా హాబీ పెన్సిళ్ళు సేకరించడం. (హాబీ అనే పదానికి అర్థం అలవాటు అని తెలిసిందే). తమిళంలో ఇందుకు సంబంధించిన సరైన మాట కోసం వెతగ్గా రెండు మాటలు తెలిసొచ్చాయి. అవి, మగియ్ పని. విరుప్పకళై. తెలుగులో వీటి అర్థాలు – సంతోషకరమైని పని. ఇష్టమైన కళ. అలాగే పెన్సిల్ అనే మాటకు తమిళార్థం కరిక్కోల్.

పోస్టల్ స్టాంపులు, నాణాలు, కరెన్సీ నోట్లు వంటివి సేకరించడం సర్వసహజం. అయితే నేను పెన్సిళ్ళు సేకరించడానికి సరైన కారణం అంటూ ఏదీ లేదు.

ఆరు, ఏడు తరగతులు చదువుతున్నప్పుడు ఎరుపు నలుపు రంగులలో ఉండే నటరాజ్ పెన్సిళ్ళతో రాసి రాసి బోరుకొట్టింది. మా నాన్న ఆఫీసు పని నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళొస్తుండేవారు. అలా వెళ్ళొచ్చినప్పుడల్లా అక్కడ భిన్నంగా విచిత్రంగా కనిపించే పెన్సిళ్ళను నాకోసం కొనుక్కొస్తుండేవారు. వాటిని ఉపయోగించకుండా దాచుకునే దానిని. కొన్ని రోజులకే పెన్సిళ్ళపై ప్రేమ పెరిగి సేకరణకు శ్రీకారం చుట్టాను.

నా దగ్గర ఒక పెట్టె ఉండేది. ఆ పెట్టెలో పెన్సిళ్ళను పడేసేదానిని. అయితే నాన్న వాటిని ఎలా వరుసలో ఉంచాలో చెప్పడం మొదలుపెట్టారు. పెన్సిళ్ళ సైజు, లావు పాటివి, సన్నపాటివి‌, గుండ్రానివి, బొమ్మలతో ఉన్నవి ఇలా రకరకాల పెన్సిళ్ళు ఓ క్రమంలో పెట్టడం మొదలుపెట్టాను. ఈ నేపథ్యంలోనే పెన్సిళ్ళు ఎలా తయారుచేస్తారో కూడా తెలుసుకున్నాను. వాటి గురించి అంతర్జాలంలో చదివాను.

ఒక్కొక్కప్పుడు స్కూల్లో ఉపయోగించుకునే పెన్సిల్ పోతే నా సేకరణలో నించి ఒక పెన్సిల్ తీసుకుని చెక్కుకుని ఉపయోగించేదానిని. ఇందువల్ల నా సేకరణలో పెన్సిళ్ళ సంఖ్యతగ్గిపోయేది. అక్కయ్యకు పెళ్ళయి అమెరికా వెళ్ళాక నా సేకరణ పట్టికలో విదేశ పెన్సిళ్ళూ కలిసేవి.

చిన్న వయస్సులో మొదలైన ఈ పెన్సిల్ సేకరణ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదివే వరకూ కొనసాగింది. ఆ తర్వాత నేను సేకరించిన పెన్సిళ్ళన్నింటినీ ఒక పెట్టెలో ఉంచి అటకమీద పెట్టేసాను. మొత్తంమీద మూడు వందల యాభై పెన్సిళ్ళు చేరాయి.

డిగ్రీ తర్వాత ప చదువులు, ఉద్యోగం, పెళ్ళి, ఇలా జీవితంలో వివిధ దశలతో పెన్సిళ్ళ సేకరణపై దృష్టి పెట్టలేకపోయాను.అటక మీద ఉంచిన పెట్టె అలాగే ఉండిపోయింది. ఇప్పుడీ ఉత్తరం రాయడంకోసం అటక మీద నించి పెట్టె కిందకు దింపి తెరచి చూడగా ఎంత ఆనందం వేసిందో. నాన్న మీది జ్ఞాపకంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ పెన్సిళ్ళ గురించి నేనూ నాన్నా ఎన్నెన్ని కబుర్లు చెప్పుకున్నామో. పెన్సిళ్ళపై ఉన్న దేశదేశాల జెండాలు, రామాయణ కథకు సంబంధించిన బొమ్మలు, జంతువుల బొమ్మలు, ఇలా రకరకాల బొమ్మల గురించి నేనడిగిన ప్రశ్నలకు నాన్న ఎంతో ఓపికగా జవాబులు చెప్పేవారు.

Pencil Collection :

పెన్సిల్ రాయడానికి ఉపయోగించే ఓ సాధనం. ఇది గ్రాఫైట్, చెక్క నుంచి తయారవుతుంది. జోసెఫ్ డిక్సన్ అనే అతను పెన్సిల్ తయారు చేశాడు. ఆయన స్వస్థలం ఇంగ్లాండ్‌. ఇతనొక నిరుపేద. ఇల్లు గడవటం కోసం ఓ చిన్న దుకాణంలో నౌకరుగా చేరాడు. యజమాని చెప్పే పనులు గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఓరోజు కింద పడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. ఆ క్షణంలో అతనికో ఆలోచన వచ్చింది. ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాలను గోడమీద ఆ నల్లరాయితో రాస్తుండే వాడు. ఆ రాయి మరేంటో కాదు. అది గ్రాఫైట్ అని తెలుసుకున్నాడు.

డిక్సన్‌ ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపాడు. దానిని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత దాంతో రాశాడు. బాగానే ఉందది. కానీ అది కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలులేకుండా ఉంది. పైగా చేతులు నల్లగా అయిపోయేవి. ఏం చేయాలా అని ఆలోచించి రకరకాల ప్రయోగాలు చేశాడు. చిలరికి పెన్సిల్ రూపం తయారైంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. ఇలా మా నాన్న ఎన్నో విషయాలు చెప్పేవారు.

చాలామంది ఇలాంటి సేకరణలపై దృష్టిపెట్టరు. పైగా టైమ్ వేస్ట్ అనేవారు. కొనీ ఓ ఏ సేకరణ అయినా ఇష్టంతో చేస్తే కలిగే ఆనందమే వేరు. నా విషయానికొస్తే ఈ పెన్సిళ్ళ సేకరణతోనే నాన్నతో ఎంత సన్నిహితంగా మెలిగానో మాటల్లో చెప్పలేను.

ఓమారు మా ఆఫీసులో ఒక్కొక్కరూ తమకిష్టమైన అంశంమీద మాట్లాడాలని మేనేజర్ చెప్పినప్పుడు నేను నా పెన్సిళ్ళ గురించి గంటకుపైగా మాట్లాడాను. పెన్సిల్ తయారయ్యే విధానం మొదలుకుని రకరకాల పెన్సిళ్ళ గురించి చెప్తుంటే అందరూ ఎంతో ఆసక్తితో విన్నారు. నన్ను కొనియాడారు.

మరుసటిరోజు ఉదయం నేను ఆఫీసుకి వెళ్ళేసరికి ఓ చిన్న బాక్స్, దానికింద ఒక కవర్ చూసాను. ఏమిటాని ఆ కవర్ లో ఉన్న నోట్ బయటకు తీసి చదివాను.

“మీరు పెన్సిళ్ళ సేకరణ గురించి చెప్పిన విషయాలన్నీ ఎంతో బాగున్నాయి. మీవల్ల మాకెన్నో విషయాలు తెలిసాయి. ఇక్కడ మీకోసం ఓ అయిదు రకాల పెన్సిళ్ళు చిన్న బాక్సులో ఉంచాను. అవి మీకు నా కానుక. స్వీకరించగలరు” అన్న మాటలు చదువుతుంటే నాకెంత ఆనందం వేసిందో. కానీ సంతకం లేకపోవడంతో అది ఎవరి కానుకో ఇప్పటివరకూ తెలీలేదు. ఎవరెవరినో అడిగాను. ఎవరూ తమకు తెలీదన్నారు.

నేనూ, నాన్నా కలసి సేకరించిన ఈ పెన్సిళ్ళను మరింత విస్తరించి మా అమ్మాయికి ఇస్తాను. అప్పుడు తన మోమున ఆనందం చూడాలని ఉంది.”

తమిళంలో ఒకామె ఈ వ్యాసం రాయగా అది ఓ వారపత్రికలో అచ్చేశారు. అందులోనూ రాసిన వారి పేరు ఇవ్వలేదు. ఇట్లు అని, పేరు మార్చినట్టు ఓ నోట్ ఇచ్చారు.

ఇది చదివి ఓ పాఠకుడు రాసిన ఉత్తరం…
“గొప్ప సేకరణ. మీ దగ్గర రకరకాల పెన్సిళ్ళు 350 దాకా ఉండటం బలేగా ఉంది. ఎక్కడ పెన్సిల్ చూసినా మీరే గుర్తుకొస్తారు అని.

– యామిజాల జగదీశ్

Also Read : లైఫ్ లో లైఫ్ ట్యాక్స్ కట్టం

RELATED ARTICLES

Most Popular

న్యూస్