Sanskrit-The mother Language of all: అన్ని భాషలకూ అమ్మ సంస్కృతం. అసలు సంస్కృతి అనే పదమే సంస్కృతమనే భాషతో ముడిపడి ఉందంటే… ఆ భాష గొప్పతనాన్ని కొలమానంతో కొలువక్కర్లేనిది. అయితే అలాంటి భాషకు మన తెలుగుజాతెంత విలువనిస్తుందని ఓ అంచనాతో ఇతమిద్ధంగా చెప్పలేంగానీ… అనుకున్న స్థాయిలో దానికి ఆదరణైతే లేదనేది మాత్రం వాస్తవం. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు దేశ, విదేశాల్లో సంస్కృత భాషకు పట్టం కడుతూ పలు విశ్వవిద్యాలయాలు దాన్నో కోర్సుగా కూడా ప్రవేశపెడుతున్నాయంటే దాని విలువను ఇంత అని మనం ప్రత్యేకంగా బేరీజు వేసే స్థితిలో లేమన్నట్టే! అలాంటి సంస్కృత భాషనుద్ధరించే క్రమంలో ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఏకంగా రెండో అధికారిక భాషగా ప్రకటిస్తే… సంస్కృతంలో తన పాండిత్యంతో ఆ కాళికాదేవిని కొల్చి ఆమె కృపకు పాత్రుడైన కాళిదాసు పేరిటే మహారాష్ట్రలో ఏర్పాటైన కులగురు కాళిదాస యూనివర్సిటికీ మన తెలుగువాడే ఇప్పుడు వైస్ ఛాన్స్ లర్ కావడం తప్పకుండా అందరం కొనియాడాల్సిన ఓ విశేషం.
అయితే అలాంటి కోవలో ఇప్పుడు పెన్నా మధుసూదన్ తెలంగాణావాసిగా… నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన సగటు తెలుగువాడిగా… మరాఠా రాష్ట్రంలో వైస్ ఛాన్స్ లర్ గా పీఠాన్నధిరోహించడం… ప్రతీ తెలుగువాడూ గర్వించదగ్గ క్షణం. అదీ.. అమ్మలాంటి సంస్కృతాన్ని ఆదరించే ఓ స్థాయిలో! సుమారు 3500 ఏళ్ల క్రితం ఉద్భవించిందని చెప్పుకునే దేవభాషగా… సంస్కృతం సుమారు 97 ఇతర భాషలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తన ప్రభావాన్ని కల్గి ఉందని చెప్పుకుంటుంటారు. నాసావారి ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషల్లోకీ.. అత్యంత స్పష్టమైన ఉచ్ఛారణ కల్గిన భాషా సంస్కృతమేనట! అంతేకాదు.. ప్రపంచంలోని ఇతర భాషలన్నింటికన్నా.. అత్యధిక శబ్దకోశమున్న భాషగా కూడా సంస్కృతానికి గుర్తింపు. అలాగే ఒక పదానికి అనేక పర్యాయపదాలు కూడా ఈ భాషలోనే దొరుకుతాయని.. ఉదాహరణకు ఒక్క ఏనుగుకే వంద పర్యాయపదాలున్నట్టుగా చెబుతుంటారు ఈ భాష గురించి తెలిసిన మేధావులు. కానీ, దీనిపై మమకారంతో ఈ భాషా సేవ చేసేవాళ్ల సంఖ్య మాత్రం వేళ్లమీదే లెక్క పెట్టుకోవాల్సిన దుస్థితి నేడు!
ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్ఛారణతో పోలిస్తే.. నాలుక గ్రంథుల పూర్తి వినియోగం జరిగేదీ సంస్కృత భాషతోనే! అందుకే సంస్కృతాన్ని ఇప్పటికీ కొందరికి స్పీచ్ థెరపీగా కూడా వాడుతుంటారట!! కంప్యూటర్ అల్గారిథమ్స్ డీకోడింగ్ కూ ఈ సంస్కృత భాషే అత్యంత ఉపయుక్తమైందని గతంలో ఫోర్బ్స్ వంటి మ్యాగజీన్సూ 1987లోనే పేర్కొన్న విషయం ఆ భాషాభిమానులకు తెలిసిందే! అందుకే జర్మనీలోని 14 యూనివర్సిటీల్లో సంస్కృత భాష బోధన జరుగుతుండగా… ఇప్పుడు మన తెలుగు నేలపై అక్కడో ఇక్కడో తప్పించి… ప్రపంచంలోని సుమారు 17 దేశాల్లో ఈ భాషా గొప్పదనాన్ని గుర్తించి ఓ కోర్స్ గా ప్రవేశపెట్టారు.
ఇలా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు.. మీడియా వంటివి గుర్తించిన ఈ సంస్కృతాన్ని ఆదరించే విషయంలో మన పక్క రాష్ట్రం కర్నాటక మిగిలిన రాష్ట్రాలకు ఓ దిక్సూచిలాంటింది. కర్నాటకలోని మాటూర్ లో అక్కడి జనం మాట్లాడే వాడుక భాషే సంస్కృతమంటే… అది ఆ దేవభాష చేసిన పుణ్యమనాలా... లేక, దేవభాషను మాట్లాడుతున్న గ్రామంగా మాటూరుకు దక్కిన అదృష్టమనాలా అనేది ఓ విశేష చర్చ! ఎందుకంటే ఒక ఊరు ఊరంతా సంస్కృతం మాట్లాడగలదంటే… మన దేశంలో అదొక్క కర్నాటకలోని మాటూరు మాత్రమే!!
అయితే ఇదే కర్నాటకకు చెందిన వరదరాజ అయ్యంగార్ ఎందరు వద్దన్నా.. సంస్కృతంపై తనకున్న మమకారంతో ఏకంగా సుధర్మ అనే సంస్కృత పత్రికనే ప్రారంభించి.. భారతదేశంలో ఏకైక సంస్కృత పత్రికా వ్యవస్థాపకుడిగా ఖ్యాతిగాంచిన విషయమూ… ఆ తర్వాత ఈ మధ్యే దివంగతుడైన ఆయన కుమారుడు సంపత్ కుమార్ దాన్ని ముందుండి నడిపించిన విషయమూ ఆ భాషా ప్రేమికులందరికీ విదితమే! ఇప్పుడు ఆ కోవలోకి మన తెలుగు తేజం… తెలంగాణా బిడ్డడైన పెన్నా మధుసూదన్ రావడం… ఏకంగా మహారాష్ట్రలోని కులగురు కాళిదాస యానివర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ గా పీఠాన్నధిరోహించడమంటే.. అది తెలంగాణా గడ్డపై, తెలుగునేలపై సంస్కృతానికి దక్కుతున్నఆదరణగా ఓవైపు గర్వపడుతూనే.. ఇంకోవైపు ఆ స్ఫూర్తితో దైవభాషైన సంస్కృత భాషోద్ధరణ జరగాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది.
-రమణ కొంటికర్ల
Also Read : వైద్యో నారాయణో హరీ!