బలోచిస్తాన్, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రాల్లో రోజు రోజుకు తెహ్రిక్ ఐ తాలిబాన్ పాకిస్తాన్ (TTP) బలపడుతోంది. తాజాగా టిటిపి కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్న వీడియోలను ఆ సంస్థ ట్విట్టర్ లో విడుదల చేసింది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా విడిచి వెళ్ళిన అత్యాధునిక ఆయుధ సామాగ్రి వీరి శిక్షణ కేంద్రాల్లో కనిపిస్తున్నాయి. M24 స్నిఫర్ రైఫిల్స్ , M4 కార్బైన్స్ , 85 సింగల్ ట్యూబ్ రాకెట్ లాంచర్లు తదితర ఆయుధాలు వీరి దగ్గర ఉన్నాయి. తాలిబాన్ ల నుంచి వీరికి ఆయుధాలు అందినట్టుగా తెలుస్తోంది.
పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉన్న డ్యురాండ్ లైన్ సరిహద్దు రేఖ వద్ద కొద్ది నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యురాండ్ సరిహద్దు రేఖ మార్చేందుకు పాకిస్తాన్ సైన్యం కంచె తొలగించటం వివాదాన్ని రాజేసింది. దీంతో ఈ ప్రాంతంలో తాలిబన్లు – పాకిస్తాన్ సైన్యం మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం సహించేది లేదని ఇప్పటికే తాలిబాన్ పాలకులు పాకిస్తాన్ ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టిటిపి బలోపేతం కావటం పాక్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టిటిపిని కట్టడి చేయాలని తాలిబన్లకు చెప్పినా వారు పట్టించుకున్న దాఖలాలు లేవు.
పాకిస్తాన్ లోని ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ అధికారులు, సైన్యం ఉగ్రవాద ముద్ర వేసి అమాయక యువకుల్ని పొట్టన పెట్టుకున్తున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్వాత్ లోయ, బజౌర్, ధర్ జిల్లాల్లో ప్రజలు పాక్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపొస్తున్నారు. తాలిబన్లకు సహకరించిన పాక్ సైన్యం వారు ఇప్పుడు ఎదురు తిరగటంతో అమాయక ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడుతున్నారు. జామాత్ ఉలేమా ఐ ఇస్లాం ఫజుల్ (JUI-F) అధ్వర్యంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. బజౌర్ జిల్లాలో నిరసనలు అదుపు తప్పుతున్నాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలం మీద దాడులకు దిగుతున్నారు. దీంతో అల్లర్లను కట్టడి చేసేందుకు చాలా చోట్ల ఇంటర్నెట్, విద్యుత్ నిలిపివేశారు.