Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో పెప్సికో విస్తరణ

తెలంగాణలో పెప్సికో విస్తరణ

తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సికో ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కే తారక రామారావు తో జరిగిన సమావేశంలో పెప్సికో సంస్థ ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయాన్ని తెలియచేశారు. హైదరాబాద్ కేంద్రంగా పెప్సీకో నిర్వహిస్తున్న గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను మరింతగా విస్తరించి కార్యకలాపాలను రెట్టింపు చేస్తామన్నారు. కేవలం 250 మందితో 2019లో ప్రారంభమైన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ లో ఈరోజు 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్న పెప్సికో, ఈ సంఖ్యను నాలుగువేలకు పెంచబోతున్నట్లు తెలిపింది. సంవత్సర కాలంలో ఈ అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామంది. ఇందుకు సంబంధించిన పెట్టుబడి గణాంకాలను త్వరలోనే ప్రకటిస్తామంది.

దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో జరిగిన సమావేశంలో పెప్సికో విస్తరణ ప్రణాళికలపై ఆ సంస్థ కార్పొరేట్ కార్యకలాపాల కార్యనిర్వాక ఉపాధ్యక్షులు రాబర్టో అజేవేడో, మంత్రి కేటీఆర్ తో చర్చించారు. హైదరాబాద్ బిజినెస్ సర్వీస్ సెంటర్ ను స్వల్ప కాలంలోనే భారీగా విస్తరించామని, ఇందుకు నగరంలో ఉన్న అత్యుత్తమ మానవ వనరులే ప్రధాన కారణమని మంత్రి కేటీఆర్ కి రాబర్టో తెలిపారు. పెప్సీకో అంతర్జాతీయ కార్యకలాపాలకు అవసరమైన సేవలను హైదరాబాద్ నుంచే అందిస్తామన్నారు. ముఖ్యంగా మానవ వనరుల డిజిటలైజేషన్, ఆర్థిక సేవల వంటి ప్రధానమైన అంశాలపై ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు రాబర్టో. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ ను విస్తరించడంతోపాటు తెలంగాణలో పెప్సీకో ఇతర విభాగాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలపైన ఇరువురి మధ్య చర్చ జరిగింది.

హైదరాబాద్ లో కార్యకలాపాలను రెట్టింపు చేసేందుకు పెప్సీకో నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న పెప్సీకో విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్న కేటీఆర్, ఇప్పటికే అనేక ప్రఖ్యాత సంస్థలు ఆహార ఉత్పత్తుల తయారీలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. పెప్సీకో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అనేక అంశాలు, కార్యక్రమాలను పెప్సికో సంస్థ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించడంతో తెలంగాణ ప్రభుత్వ నీటి నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ- రీసైక్లింగ్ అంశాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పెప్సికో ఆసక్తి వ్యక్తం చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్