Sunday, January 19, 2025
HomeTrending Newsముసుగు రాజకీయాలు ఎందుకు?: పేర్ని

ముసుగు రాజకీయాలు ఎందుకు?: పేర్ని

అన్ స్టాపబుల్ కార్యక్రమం పేమెంట్ ఇచ్చే టాక్ షో అని, బాలయ్య చేసే షోలో పవన్ పాల్గొనడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన  అవసరం ఏముందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బావ తప్పులను సరి చేయడానికి, బావ పార్ట్ నర్ లను కూర్చో బెట్టి మాట్లాడడానికి బాలకృష్ణ ఈ షోను ఉపయోగించుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఈ షో లో  పాల్గొన్న బాలయ్యకు, పవన్ కు ఇద్దరికీ పేమెంట్ ఇస్తారని…. ఏం మాట్లాడాలో, ఏ ప్రశ్నలు అడుగుతారో ముందే స్క్రిప్ట్ ఇస్తారని నాని అన్నారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రజాస్వామ్యం… అవినీతి గురించి మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని పేర్ని ఎద్దేవా చేశారు. నేడు విజయవాడలో టిడిపి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై నాని స్పందించారు.  ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పేరిట పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు అంటే వల్లమాలిన ప్రేమ ఉన్నవాళ్ళంతా నేడు విజయవాడలో సమావేశం అయ్యారని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు వగలాడిగా మాట్లాడుతున్నారని, ప్రతిరోజూ వారంతా బరితెగించి మాట్లాడుతున్నారని, కానీ రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం లేదని మాట్లాడారని ధ్వజమెత్తారు.  జగన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

31 లక్షల మంది ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే కమ్యూనిస్టులు ఇల్లా మట్లాడడ్డం సరికాదని, నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగు కోరుకుంటారని.. కానీ తమ ప్రభుత్వం పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే సహించలేని మీరు కమ్యూనిస్టులా అని తీవ్రంగా మండిపడ్డారు. నారాయణ, రామకృష్ణలు తమ పార్టీని బాబుకు తాకట్టు పెట్టారన్నారని బాబును సిఎం చేయడమే వారి లక్ష్యంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విజయవాడలో మీటింగ్ పెడితే స్టేజ్ మీద అంతా ఒక వర్గం వాళ్ళే ఉండేవారని, ఇప్పుడు అన్ని పార్టీలవారితో లోపాయికారీగా మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశాలు పెడుతున్నారని అన్నారు.

ఈ అన్ని పార్టీలు ముగుసు వేసుకొని రాజకీయాలు చేయడం ఎందుకని,  అందరూ కలిసి రావాలని సవాల్ విసిరారు.  దమ్ముగా రాజకీయం చేయాలని బాబుకు సూచించారు. ఎన్ని విషపు రాతలు మాట్లాడినా, ఏం రాసినా ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల ఉన్న అచంచల విశ్వాసాన్ని ఆవగింజ అంత కూడా కదల్చలేరని పేర్ని ధీమావ్యక్తం చేశారు.  బిజెపికి కాపులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాబు గతంలో కేంద్రానికి పంపిన రిజర్వేషన్ తీర్మానాన్ని  పార్లమెంట్ లో పెట్టి ఆమోదించాలని పేర్ని రాష్ట్ర బిజెపి నేతలకు  సలహా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్