అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో పోర్టు నిర్మిస్తానని 2014 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు పెద్ద అబద్ధాలకోరు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మచిలీపట్నాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తానని నాడు చెప్పారని గుర్తు చేశారు. మళ్ళీ ఇపుడు 2023లో ఏ మొహం పెట్టుకొని బందరు వచ్చారని నిలదీశారు. ఇంతకన్నా పిట్టలదొర, రాజకీయ మోసగాడు మనకు దొరుకుతాడా అని నాని ప్రశ్నించారు.
బాబు నిన్నటి బందరు సభలో సంధి ప్రేలాపలనలు చేశారని, జనం లేకపోయినా వచ్చారని, అసలు కార్యకర్తలే లేకపోయినా వారు పట్టుదలతో ఉన్నారని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. అసలు బందరు వచ్చే అర్హత బాబుకు ఉందా అని నాని ప్రశ్నించారు. ఖాళీ కుర్చీలను ఉద్దేశించి గంటన్నర సేపు ప్రసంగించిన చంద్రబాబును చూసి మెచ్చుకోవాలని వ్యంగ్యంగా అన్నారు.
మే మూడో వారంలో బందరు పోర్టు పనులకు సిఎం జగన్ శంఖుస్థాపన చేయబోతున్నారని, ఓ మంచి ముహూర్తం కోసమే వేచి చూస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గంలో 25 వేల మందికి సిఎం జగన్ ఇళ్ళస్థలాలు ఇచ్చారన్నారు. నమ్మకానికి సిఎం జగన్ ఎలా మారు పేరో…. వెన్నుపోటు, దగాకు బాబు పేరుగా నిలుస్తాన్నారు. నాడు బాబు హయాంలో పోర్టు కోసం 33 వేల ఎకరాలు గ్రామాలు, స్మశానాలు సహా సహా భూ సేకరణ చేయాలని చూస్తే ప్రజలు కోర్టుకు వెళ్ళక ఏం చేస్తారని ఎదురు ప్రశ్నించారు. రైతుల నుంచి భూ సేకరణకు సిఎం జగన్ ససేమిరా అన్నారని, పోర్టు రహదారి కోసం తప్ప ఇతరత్రా అవసరాల కోసం భూమి సేకరించడం లేదని, కేవలం ప్రభుత్వ భూమిలోనే పోర్టు కడుతున్నామని వివరించారు. అసలు బాబు లాంటి దగాకోరు ఎవరైనా ఉంటారా అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సిఎం జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి వెళుతున్నాయని, కానీ బాబు హయంలో జన్మభూమి కమిటీలకు, పచ్చ చొక్కాలకు దోచి పెట్టింది నిజం కాదా అంటూ నాని ఎదురుదాడి చేశారు. జగన్ క్యాన్సర్ కాదని, బాబు అంటురోగం అని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు మిమ్మల్ని గత ఎన్నికల్లో మురికి కాలవలో పడేశారని… పిల్లనిచ్చిన మామను, బావమరుదులను, తోదల్లుల్లను మోసం చేసిన చంద్రబాబే పెద్ద సైకో అని దుమ్మెత్తి పోశారు.
నిన్నటి సభలో తనపై బాబు అసత్య ఆరోపణలు చేశారని, వాటిపై తనతో బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబుకు పేర్ని నాని సవాల్ విసిరారు. కోల్లు రవీంద్ర చీటీలు అందిస్తే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పాపపు సొమ్మును తన ఇంటి గడప దాటి లోపలకు రానిస్తే తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలను మోసం చేసినట్లేనని, అది అశుద్ధంతో సమానమంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
హరీష్ రావు రాజకీయాల్లో చాల మేధస్సు ఉన్న నాయకుడని, బుర్ర పదునుగా ఉంటుందని… చాకిరీ తనతో చేయించుకొని కొడుకులు, కూతురుని పైకి తెస్తున్నాడన్న కోపం మేనమామ కేసిఆర్ పై ఉందని, అందుకే అప్పుడప్పుడూ ఆంధ్ర ప్రదేశ్ ను గోకుతుంటాడని పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మామను తిట్టాలంటే నేరుగా తిట్టవచ్చని తమను గోకాల్సిన అవసరం లేదని హితవు పలికారు. ఏపీ ప్రజలపై ప్రేమ ఉంటే రాలయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.