చంద్రబాబు వందేళ్ళు బతికి ఉండాలనే తాము కోరుకుంటున్నామని, ఆయన్ను చంపాల్సిన అవసరం తమకు లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అయన చెబుతున్న రోజులన్నీ పాత సినిమాల్లో విలన్లు చెప్పిన మాటల్లా ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ తగ్గుతున్న సమయంలో మల్లెల బాబ్జీతో ఆయనపై హత్యా ప్రయత్నం చేయించిన చరిత్ర బాబుకే ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలను అడ్డుకునేందుకే తనను నాడు అలిపిరి దాడి నుంచి వెంకటేశ్వర స్వామి కాపాడాడని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన పాపం వల్లే రాజకీయంగా జగన్ చేతిలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని… 2024 తరువాత చంద్రబాబు మరింత కుంగిపోవాల్సి ఉంటుందని, దాని కోసమే బాబు బైటపడ్డారని పేర్ని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఎప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉండాలని తాము అనుకుంటుంటే ఆయన్ను ఏదో చేయించాలని ఎందుకు అనుకుంటామని ప్రశ్నించారు. బాబు ప్రతిపక్షనేతగా ఉంటేనే జగన్ కు గెలుపు నల్లేరుపై నడక అవుతుందన్నారు. మొన్నటిదాకా రాష్ట్రం శ్రీలంక అవుతుందని బాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు మాత్రం జగన్ పథకాలన్నీ తాము కొనసాగిస్తామని… ఇంకా ఎక్కువ చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వారిద్దరినీ చూస్తుంటే జాలిగా ఉందన్నారు. బాబు, పవన్ లను జగన్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజార్చారనేది అలోచించుకోవాలన్నారు. ఏ నోటితో అయితే ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పాడో అదే నోటితో తాను కూడా ఉచిత కరెంటు ఇస్తానని 2009 ఎన్నికల్లో చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. 2014-19 వరకూ సాగిన తన పరిపాలన మళ్ళీ తీసుకువస్తానని చెప్పి ఓట్లడిగే దమ్ము చంద్రబాబుకు లేకపోవడం ఆయన ఖర్మ అని దుయ్యబట్టారు.
Also Read : బాబు కోసం ఇంత దిగజారతారా?: పేర్ని