Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇచ్చట చవకగా ఫోన్ ట్యాపింగ్ చేయబడును!

ఇచ్చట చవకగా ఫోన్ ట్యాపింగ్ చేయబడును!

విలేఖరి:-
సార్! మీకు ఈ ఏటి మేటి ఫోన్ ట్యాపింగ్ నైపుణ్య ప్రతిభా పురస్కారం వచ్చిన సందర్భంగా అభినందనలు. ఈ సందర్భంగా మిమ్మల్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందాం.

ఫోన్ ట్యాపింగ్ నిపుణుడు:-
తప్పకుండా. నా నైపుణ్యం లోకానికి తెలియాలి. నా నేర్పు ఇతరులకు స్ఫూర్తి కావాలి. ఊరూరా నాలా చవకగా, సులభంగా, వేగంగా ఎందరో ఫోన్ ట్యాపింగ్ నిపుణులు పుట్టుకురావాలి.

వి:-
ఫోన్ ట్యాపింగ్ ను ఒక వృత్తిగా ఎంచుకోవాలని మీకెప్పుడు అనిపించింది?

ని:-
అది దైవ ఘటన. నేను యాదగిరిగుట్ట సి ఐ గా పని చేస్తున్నప్పుడు మా ఎస్ పి సార్ భక్తుడిగా గుడికి వచ్చారు. గదిలోకి వెళ్లిన ఆయన గుడిలోకి వెళ్లకుండా గదిలో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. గంటల కొద్దీ లోపల ఫోన్లో ఆయనేమి మాట్లాడుతున్నారో వినాలన్న కుతూహలం కొద్దీ అప్పటికప్పుడు నా స్మార్ట్ ఫోన్లో ఒక ఇజ్రాయిల్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేసుకుని…మా ఎస్ పి సార్ ఏమి మాట్లాడారో విన్నాను. అది తెలిసిన మా ఎస్ పి సార్ నా ఉద్యోగం తీసేస్తారనుకుని భయపడ్డా. నాలో ట్యాపింగ్ నైపుణ్య వేగానికి, కచ్చితత్వానికి ఆయన మురిసిపోయారు. దేవుడి దర్శనం కూడా చేసుకోకుండా నన్ను వెంటబెట్టుకుని హైదరాబాద్ తీసుకొచ్చి...రెండు మూడు ప్రమోషన్లు, మూడు నాలుగు ఇంక్రిమెంట్లు, అయిదారు ఆఫీసులు ఇచ్చి...అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు అప్పగించారు. అంతా యాదగిరిగుట్ట మహిమ!

వి:-
ఫోన్ ట్యాపింగ్ కు మీరు పెద్ద వ్యవస్థే ఏర్పాటు చేసుకున్నటున్నారు?

ని:-
అవునండీ. మొదట్లో హైదరాబాద్ ఒక్క చోటే సర్వర్ ఉండేది. తరువాత అన్ని ప్రాంతాలకు సమ ట్యాపింగ్ న్యాయం చేయాలన్న సదుద్దేశంతో భౌగోళికంగా అనుకూలమైన మరో రెండు ప్రాంతాల్లో కూడా అనధికారిక సువిశాల అధునాతన ట్యాపింగ్ కేంద్రాలను ప్రారంభించాల్సి వచ్చింది.

వి:-
ఒక్కో ట్యాపింగ్ కేంద్రానికి ఎన్ని కోట్లు ఖర్చవుతుంది? ఇందులో వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ ఎంత? మంత్లీ రికరింగ్ ఖర్చు ఎంత?

ని:-
దీనిమీద మీడియాలో చిలువలు పలువలుగా వార్తలొస్తున్నాయి. అయిదారు కోట్లతో ఒక్కో ట్యాపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అందరూ అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక్కో ట్యాపింగ్ కేంద్రంలో ఒక డెస్క్ టాప్, ఒక ఏసీ, ఒక కుర్చీ, ఒక హెడ్ ఫోన్, కొన్ని పెన్ డ్రైవ్ లు, కొన్ని హార్డ్ డిస్క్ లు- అంతే. మహా అయితే ఒక్కో కేంద్రానికి పెట్టుబడి అయిదు లక్షలు అయి ఉంటుంది- అంతే. నెల ఖర్చు జీతాలు తప్ప ఇంకేమీ ఉండదు.

వి:-
అరెరే. ట్యాపింగ్ ఇంత అగ్గువా? ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎంతమందిని ట్యాప్ చేసి ఉంటారు?

ని:-
రాష్ట్రంలో నేను ట్యాప్ చేయని నంబరే లేదు.

వి:-
మిమ్మల్ని ట్యాప్ చేయమని ఎవరు చెప్పారు?

ని:-
నో కామెంట్.

వి:-
మీరు ట్యాప్ చేసి ఆడియో ఫైల్స్ ఎవరికిచ్చారు?

ని:-
నో కామెంట్.

వి:-
ఇది ఫలానా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నేరమని మీకు తెలియదా?

ని:-
నేరం నాది కాదు…ఆకలిది.

వి:-
అది సినిమా టైటిల్ కదా?

ని:-
నా టైటిల్ కూడా అదే.

వి:-
పనిలో పనిగా సొంత పనులకు కూడా ట్యాపింగ్ నేర్పును బాగా వాడుకున్నారట?

ని:-
“తనకు మాలిన ధర్మము…మొదలు చెడ్డ బేరం” సామెత అంటే ఎందుకో నాకు చిన్నప్పటినుండీ బాగా ఇష్టం. అందువల్ల మొదట నా సొంత అవసరాల ట్యాపింగ్ అయ్యాకే…మిగతా పనులు చూసేవాడిని.

వి:-
వికారాబాద్ అడవుల్లో అన్ని ఆడియో హార్డ్ డిస్కులను ఎందుకు ధ్వంసం చేశారు?

ని:-
పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో పవిత్రంగా ప్రారంభించిన ట్యాపింగ్…మరో పుణ్యక్షేత్రం అనంతగిరిగుట్టలో ధ్వంసం కావడం దైవ ఘటన! విధి లిఖితం. ఆ హార్డ్ డిస్కులకు అక్కడ చావు రాసి పెట్టి ఉంది! వాటి అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించి…చితి పేర్చి…గంధపు చెక్కలతో బూడిద చేశాను. నేను కొంచెం సెంటిమెంటల్. సంప్రదాయవాదిని. ఆచారాలంటే పడి చస్తాను!

వి:-
మీ భవిష్యత్ ప్రణాళిక?

ని:-
వికారాబాద్ అడవుల్లో పదెకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ట్యాపింగ్ విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పడానికి భూమి కొని పెట్టుకుని ఉన్నాను. అనంతగిరి అనంతపద్మనాభస్వామి అనుగ్రహంతో త్వరలోనే ఈ ట్యాపింగ్ యూనివర్శిటి నిర్మాణం మొదలు పెడతాను.

వి:-
(స్పృహదప్పి పడిపోయాడు)

ఆ సమయంలో ఆ ప్రాంతంలో సెల్ టవర్లు సిగ్నల్ ప్రసారాలు చేయలేక సిగ్గుతో తల దించుకున్నాయి. కానీ నిపుణుడి సెల్లో సిగ్నల్ ఆగలేదు. నిపుణుడు తల ఎత్తుకుని విజయగర్వంతో నిలుచున్నాడు!

విలేఖరిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడానికి నిపుణుడే పెద్ద మనసుతో సాయపడ్డాడు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్