Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం750 కోట్ల Picasso చిత్రం

750 కోట్ల Picasso చిత్రం

“భాష బాగా తెలిసినవాడికి బాధ ఎక్కువ”

కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో అలవోకగా చెప్పిన సిద్ధాంతమిది. అంటే అనేక విధాలుగా ఆ బాధను భాష ద్వారా వ్యక్తీకరిస్తూ- చివరకు బాధను వ్యక్తీకరించడానికే సమస్త భాష ఉన్నట్లు వ్యవహరిస్తాడని, లేదా తన భాషా పరిజ్ఞానంతో చిటికెడు బాధను కడివెడు బాధగా మార్చుకుంటాడని కొడవటిగంటి పరిశీలన.
ఇది దెప్పి పొడుపు కావచ్చు.
విమర్శ కావచ్చు.
పరిశీలన నిజం కావచ్చు.

అక్షరాలు, పదాలకే భాష పరిమితం కాదు. భావ వ్యక్తీకరణలో భాష ప్రధానమయిన సాధనం. సంగీతానిది ఒక భాష. శిల్పానిది ఒక భాష. వర్ణ చిత్రానిది ఒక భాష.

ఏదో ఒక అనుభూతిని ఆవిష్కరించడానికే సంగీతం, శిల్పం, చిత్రం తయారవుతాయి. కవి కవిత్వం ద్వారా తన భావావేశాన్ని చెప్పినట్లే గాయకుడు గానం ద్వారా, శిల్పి శిల్పం ద్వారా, చిత్రకారుడు చిత్రం ద్వారా తమ భావాలను చెబుతూ ఉంటారు. ఇలాగే మిగతా అరవై నాలుగు కళలు కూడా.

ప్రస్తుతం మనం చిత్రాలకు పరిమితమవుదాం. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో వేసిన ఒక చిత్రం అమెరికాలో మొన్న వేలం వేస్తే- 103 మిలియన్ డాలర్లకు అమ్ముడుబోయింది. అంటే మన కరెన్సీలో అక్షరాలా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే.

ఎనిమిదేళ్ల క్రితం లండన్లో దాదాపు నాలుగు వందల కోట్లకు కొన్న సంపన్న కళారాధకుడికి ద్విగుణీకృత లాభం వచ్చింది. ఇంకో ఎనిమిదేళ్ల తరువాత ఇదే ఖచ్చితంగా రెండు వేల కోట్ల ధర పలుకుతుంది. ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ దిన పత్రిక ఆశ్చర్యపోకుండా ఈ వార్తను ప్రచురించింది.

“కిటికీ పక్కన మహిళ” అని ఆ పెయింటింగ్ కు టైటిల్ లేకపోతే ఊపిరి సినిమాలో ప్రకాష్ రాజ్ లా నాక్కూడా అర్థమయ్యేది కాదు. ఏ సబ్జెక్ట్ లో అయినా నిష్ణాతుల అభిప్రాయం ముఖ్యమనుకుని ఒంగోలుకు చెందిన ప్రఖ్యాత వైద్యుడు, చిత్రకారుడిగా అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు పొందిన మాచిరాజు రామచంద్ర రావుకు ఫోన్ చేస్తే- నా చిత్రాజ్ఞానాన్ని చిటికెలో పటాపంచలు చేసి నా మోహం వివర్ణమయ్యేంత వర్ణ విజ్ఞానాన్ని ప్రసాదించారు.

“నీ మొహం ఫోటోలా అలాగే వేయడం కాదు పెయింటింగ్ ఆంటే. చిత్రకారుడి కళ్లతో నీ మొహాన్ని ఆవిష్కరించడం. అందులో ప్రతీకలు ఉంటాయి. సందర్భం ఉంటుంది. న్యారేషన్ ఉంటుంది. చిత్రకారుడి సొంత ముద్ర ఉంటుంది. కుంచె విరుపు ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ప్రపంచంలో ఆ స్ట్రోక్ అదొక్కటే అయి ఉంటుంది. దానికి విలువకట్టే షరాబులు ఉండరు. ఏడు వందల యాభై కోట్లేమి ఖర్మ? ఏడు వేల కోట్లయినా పెట్టి ఒక చిత్రాన్ని కొంటారు. 1960 ల నాటికే పికాసో చిత్రాల విలువ మార్కెట్లో పదహారు వేల కోట్ల రూపాయలు. ఇప్పుడది లక్ష కోట్లు అయి ఉండడంలో ఆశ్చర్యమేముంది?”

అని ఆయనకు తెలిసిన సకల చిత్ర శాస్త్ర పరిభాషనంతా ఉపయోగించి నాకు క్లాసు తీసుకున్నారు. పెద్దాయన కాబట్టి అంతా అర్థమయినట్లే నేను నటించాను.

ఏడు వందల యాభై కోట్లకు అమ్ముడుబోయిన పికాసో చిత్రం ఫోటో ఎలాగూ ఆ వార్తలో ఉంది. పికాసోవే మరో మూడు ఫేమస్ చిత్రాలు గూగులమ్మను అడిగి మీకోసం ఇస్తున్నాను. ఒక్కొక్క ఫొటోకు ఏడు వందల యాభై రూపాయలు కూడా మీరు నాకు ఇవ్వాల్సిన పనిలేదు. వృద్ధాప్యం వల్ల ఈమధ్య 1.75 రీడింగ్ గ్లాసులు వచ్చాయి. దగ్గరున్నది స్పష్టంగా కనిపించి చావడం లేదు.

ఈ చిత్రాల్లో పికాసో ఏమి చెప్పాడో? అందులో ఏముందో? తెలిసినవారు తెలియనివారికి చెబితే బాగుంటుంది. అయిదు వేలు పెట్టి ఒక నెమలి పెయింటింగ్ కొన్న సంపన్న కళారాధకుడిని అన్న నా గర్వాన్ని వీడెవడో ఏడు వందల యాభై కోట్లు పోసి తుత్తునియలు చేశాడు.

అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ – నైరూప్య చిత్రీకరణను అర్థం చేసుకోవడానికి అబ్ స్ట్రాక్ట్- నైరూప్య విద్య వచ్చి ఉండాలి.
నైరూప్య నేత్రాలు ఉండాలి.
నైరూప్య మనసు ఉండాలి.
అన్నిటికీ మించి లెక్కకు మిక్కిలి నైరూప్య ధనం ఉండాలి.

“కిటికీ పక్కన మహిళ”ను కిటికీ పక్కన పెట్టుకోవాడానికి క్యాలిఫోర్నియా ఆసామి ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు. అందులో ఏముందో పికాసోకు తెలుసు. కొన్న కళారాధకుడికి తెలుసు. మనకు తెలుసనుకుంటే తెలుసు. తెలియదనుకుంటే తెలియదు. తెలిసీ తెలియదు. తెలియకపోయినా తెలిసినట్లు తలలూపితే తెలిసినవారి గుంపులో మనకు తెలియకుండానే కలిసిపోతాం.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్