భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, హాకీ క్రీడాకారిణి రజని నేడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఇటీవల బర్మింగ్ హామ్ లో ముగిసిన కామన్ వెల్త్ గేమ్స్ లో బాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పివి సింధు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా ప్రస్తుతం టోక్యోలో జరుగుతోన్న వరల్డ్ ఛాంపియన్ షిప్స్ పోటీలకు సింధు దూరమైంది.
మరోవైపు కామన్ వెల్త్ గేమ్స్ లో మహిళల హాకీలో భారత జట్టు కాంస్యం గెల్చుకుంది. ఈ జట్టులో సభ్యురాలిగా ఉన్న హాకీ ప్లేయర్ ఇ.రజని కూడా సిఎం ను కలిశారు.
అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న సింధు, రజనీలను సిఎం అభినందించారు.జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు.
ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో గెల్చుకున్న పసిడి పతకాన్ని సీఎం జగన్‌కు చూపించగా అయన ఆసక్తిగా పరిశీలించారు. కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో గోల్‌కీపర్‌గా వ్యవహరించిన ఇ.రజని, హాకీ టీమ్ ఆటోగ్రాఫ్‌లతో కూడిన హాకీ స్టిక్, టీమ్ టీ షర్ట్‌ను సీఎంకు బహుకరించారు. రజనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, సింధు, రజని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Also Read : సింధును కలిసిన మంత్రి రోజా