తెలంగాణను దోచుకున్న వాళ్ళను విడిచి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అక్రమార్కులను కట్టడి చేస్తామని తేల్చి చెప్పారు. రామగుండం పర్యటనకు వెళుతూ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బిజెపి నాయకులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ పరోక్షంగా కెసిఆర్ పాలన అవినీతి మయమైందని ఆరోపణలు చేశారు. కెసిఆర్, కేటిఆర్ తదితర నేతల పేర్లు, పార్టీ పేరు ఎత్తకుండా మోడీ విమర్శలు సంధించారు. అవినీతి ,కుటుంబ పాలనపై జనంలో ఉన్న ఆగ్రహం దేశం మొత్తం చూస్తోందని, అవినీతి ,కుటుంబ పాలనలు అభివృద్ధి నిరోధకాలన్నారు.
రాజకీయాల్లో ఎజెండా అనేది ప్రజల సేవ లక్ష్యంగా ఉండాలని బిజెపి శ్రేణులకు ప్రధాని మోడీ చెప్పారు. మోడీపై విమర్శలు చేసే వాళ్ళను బిజెపి కార్యకర్తలు పట్టించుకోవద్దన్నారు. తెలంగాణలో అవినీతిరహిత పాలనను అందించేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. మూడ నమ్మకాల విషయంలో తెలంగాణలో ఏమి జరుగుతుందో దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడ చీకటి అలుముకుందో అక్కడ కమల వికసిస్తుందని.. అదే కోవలో తెలంగాణలో కమలం వికసిస్తుందన్నారు. ఒకప్పుడు దేశం మొత్తంలో బిజెపికి రెండు ఎంపి స్థానాలు గెలిస్తే ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారని మోడీ గుర్తు చేశారు.