Respect: ఏకవచనం పిలుపు అమర్యాద. బహువచనం పిలుపు గొప్ప గౌరవం. పెద్దవారిని నువ్వు అనకూడదు. మీరు అనాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఏకవచనం పిలుపుల మీద పెద్ద పట్టింపే ఉండదు. రాయలసీమ, తెలంగాణల్లో నిత్యవ్యవహారంలో ఏకవచనం సర్వసాధారణం. కోస్తాలో బహువచనానికే బహు డిమాండు. మీడియా రుద్దిన ప్రామాణిక భాష ప్రభావంతో ఇప్పుడు రాయలసీమ, తెలంగాణల్లో కూడా చాలావరకు “నువ్వు” “మీరు”గా మారింది.
వ్యాకరణం ప్రకారం ‘డు’ ఏకవచనం. ఒకడే అయితే క్రియాపదం చివర ‘డు’; ఒకరికంటే ఎక్కువైతే ‘రు’ రావాలి.
“(ఒక) ప్రధానమంత్రి ప్రకటించాడు”
“(ఒక) ప్రధానమంత్రి ప్రకటించారు”
“ఇరు దేశాల ప్రధానులు ప్రకటించారు”
వ్యాకరణం ప్రకారం మొదటిది, మూడోది కరెక్ట్. రెండోది తప్పు. కానీ ఆ తప్పే ఒప్పయ్యింది.
భాష ఏర్పడ్డప్పుడు ఏకవచనం అమర్యాద కానే కాదు. తరువాత ఎప్పుడో వ్యాకరణ విరుద్ధమైనా…లేని గౌరవాన్ని సంతరించుకుంది. ఏకవచనానికి సంస్కారం లేదని బహువచనం అంటే అవును కామోసు అనుకుని ఏకవచనం కూడా బహువచనం సంస్కారం బట్టలే కట్టుకున్నట్లుంది!
ప్రాచీన తెలుగులో వాడు(ఏకవచనం); వారు(బహువచనం) ఉన్నట్లు “గారు” లేదు. “గాడు” ఏకవచనమే “గారు” బహువచనమయ్యిందని విచిత్రమైన వ్యాకరణం చెప్పినవారు కూడా లేకపోలేదు. గాడు గారు అయితే ఏకవచనంలో ఉన్న అమర్యాద డబుల్ డోస్ గా పెరుగుతుందే తప్ప…తిట్టు సంస్కారంగా ఏమీ మారదు. వారు అన్న శబ్దమే గారు అయ్యిందన్నది భాషాశాస్త్రవేత్తల విశ్లేషణ. ఇంతకంటే లోతుగా వెళితే ఇది భాషా పరిణామ, భాషోత్పత్తి శాస్త్ర పాఠమవుతుంది.
కోడలి కోపం ఎంతగా కట్టలు తెంచుకున్నా- “అత్తగారండీ! మిమ్మల్ను నిలువునా పాతరేసినా పాపం లేదండీ!” అని గారు- అండీ- మిమ్మల్ను అన్న మర్యాదలు అత్తకు తగ్గడానికి వీల్లేదు- అని ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ చమత్కరించేవారు.
చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల, రాజ్యాంగపరమైన ఉన్నతస్థానాల్లో ఉన్నవారి పేర్ల ముందు శ్రీ,, గౌరవనీయ; చివర గారు అని తప్పనిసరిగా వాడాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మనలో పొంగిన భక్తి ప్రపత్తులవల్ల అలా అంటున్నాం. హిందీలో ముందు- గౌరవనీయ, ఆదరణీయ, మాననీయ, మహోదయ, శ్రీ; చివర- జీ మర్యాదలు ఇలాగే చేరాయి.
“పేరుకు ముందు ఈ తల, తోకల బరువు నాకెందుకు? ముందు- వెనుక వాడే మర్యాద వాచకాలు ఇక అక్కర్లేదు. నన్ను మోడీ అనండి చాలు” అని ప్రధానమంత్రి బీ జె పి నాయకులను, కార్యకర్తలను కోరారు. ఆయన అలా అనగానే ఇలా వెంటనే కార్యకర్తలు- “అలాగేలే మోడీ! నువ్వన్నది నిజమే! పద వెళ్లి వన్ బై టు చాయ్ తాగి వద్దాం! నడు!” అని అనగలరా? అనరు. అనలేరు. ఆ విషయం మోడీకి తెలుసు. “తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు” అన్న సూత్రం ఉండనే ఉంది. సామాన్యులు వెంటనే దేనికి కనెక్ట్ అవుతారో మోడీకి తెలిసినంత బాగా సమకాలీన రాజకీయనాయకుల్లో ఇంకెవరికీ తెలియదు. కార్యకర్తలు తన విషయంలో గౌరవ వాచకాలు వాడాల్సిన పనిలేదన్నందుకు మోడీని అభినందించాల్సిందే.
ప్రజాస్వామ్య ప్రభుత్వాల న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను సంబోధించాల్సినప్పుడు వాడుతున్న మర్యాద వాచకాల యువరానర్లు, మి లార్డ్స్ బరువు జోలికి వెళితే భాషా ధిక్కారం అవుతుందో లేదో కానీ…కోర్టు ధిక్కారం మాత్రం అయ్యే ప్రమాదం ఉంది.
మనసులో మర్యాద ఉన్నా లేకున్నా మాటలో ఉంటే చాలు. లేకుంటే-
“ఏమిటి ఆ ఏకవచన ప్రయోగం?” అని వెంటనే మన సంస్కారానికి హితోపదేశాల నీతిబోధలు మొదలవుతాయి.
బూదరాజుగారన్నట్లు-
అత్తను కొత్త కోడలు నిలువునా పాతరేయడంలో తప్పుందో…లేదో…కానీ…ఆ గొడవలో మాట మర్యాద వాచకాలకు లోబడి ఉన్నప్పుడే ఆ కోడలి వచన సంస్కారం నిర్వచనాలకు అందనంత ఎత్తులో ఉన్నట్లు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018