ఈ నెల 19న జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వలన ఈ పర్యటన వాయిదా పడిందని, పర్యటన ఎప్పుడు ఉండేదీ త్వరలోనే తెలియజేస్తామని బిజెపి రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఈ నెల 19న తెలంగాణలో పర్యటించి సికింద్రాబాద్ – విశాఖ పట్నం మధ్య ప్రతిష్టాత్మక వందే భరత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించాల్సి ఉంది. దీనితో పాటుగా 4వేల కోట్ల రూపాయలతో పలు రైల్వే ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని బిజెపి తలపెట్టింది.
అయితే వందే భరత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి కావడానికి మరి కొంత సమయం పడుతుందని తేలడంతో పిఎం టూర్ వాయిదా పడ్డట్లు తెలిసింది.
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నెలాఖరులో రాష్ట్రంలో పర్యటించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం.