సికింద్రాబాద్ – విశాఖపట్నం వరకూ నడిచే వందే భరత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఏడు వందే భరత్ రైళ్ళు నడుస్తుండగా నేడు ఎనిమిదో రైలు సర్వీసుకు శ్రీకారం చుట్టారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా, వివిధ సదుపాయాలు కల్పించడంతో పాటు అత్యంత వేగంతో ఈ రైళ్ళు నడుస్తాయి. ఈ రైళ్ళ ద్వారా త్వరగా గమ్యస్థానానికి చేరుకునే వీలు కల్పించారు.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలులో మొత్తం 16 భోగీలు ఉండగా వాటిలో 14 చైర్ కార్ మరో 2 ఎగ్జి క్యూటివ్ చైర్ కార్ ఉంటాయి, 1128 మంది ప్రయాణించవచ్చు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వారంలో ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర రాజన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్. రాజ్య సభ సభ్యుడు డా. లక్ష్మణ్, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించామని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో దేశంలో ఏడు రైళ్ళు ఇప్పటికే మొదలు పెట్టామని, ఇది ఎనిమిదో రైలు అని 2023లో ప్రారంభిస్తున్న మొదటిది ఇదే అని చెప్పారు. ఈ రైలు తో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. దేశ పురోగతికి, భవిష్యత్ భారతావనికి ఈ రైలు ఓ గొప్ప ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.