ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్బెకిస్తాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సదస్సు సెప్టెంబర్ 15,16 తేదీల్లో జరుగనున్నది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో)లో చైనా, పాకిస్థాన్, రష్యా, భారత్, తజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్, కజకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు, దారిద్య్ర నిర్మూలన తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మోడీ పర్యటనను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నేతలు ఇద్దరు ఇరు దేశాల పరస్పర సహకారం, యుఎన్ లో అనుసరించాల్సిన వ్యూహం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించనున్నారు. మరో వైపు రెండేళ్ళ తర్వాత విదేశీ పర్యటనకు వస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రాదాన్యాలపై చర్చోప చర్చలు జర్గుతున్నాయి. సదస్సు సందర్భంగా భారత ప్రధాని – చైనా అధ్యక్షుడు సమావేశం అయ్యే అవకాశం ఉంది. తూర్పు లద్దాఖ్ నుంచి చైనా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో రెండు దేశాల చర్చలు స్నేహ పూర్వకంగా జరిగే అవకాశం ఉంది.
మరోవైపు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ హుస్సేన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యే సూచనలు ఉన్నాయి. ఒకవేళ ఇద్దరు సమావేశంలో పాల్గొంటే దాదాపు ఆరేండ్ల తర్వాత రెండు దాయాది దేశాల ప్రధానులు ఒకే సదస్సులో పాల్గొనడం తొలిసారి అవుతుంది. ఈ సదస్సు సందర్భంగా ఇరు ప్రధానుల మధ్య ముఖాముఖీ భేటీలు ఉండవచ్చునని సమాచారం. పాకిస్థాన్ ప్రధానితో భేటీ గురించి భారత్ తమను సంప్రదించలేదని పాక్ ఉన్నతస్థాయి దౌత్యవర్గాలు చెప్పాయి. ఒకవేళ భారత్ కోరితే, పాకిస్థాన్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆ వర్గాల కథనం.
పాక్ లో రాజకీయ అస్థిరత, ధరల పెరుగుదల, ఉగ్రవాదుల హింస నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి – షెహబాజ్ హుస్సేన్ తో సమావేశం కావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడితే భారత్ కు ఎక్కువ మేలు జరుగుతుంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు అల్లాడుతున్నారు. భారత్ ముందడుగు వేస్తే పాక్ ప్రజల్లో భారత్ పట్ల సాజుకులత పెరుగుతుంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉజ్బెకిస్తాన్ పర్యటనపై మునుపెన్నడూ లేనంత ప్రముఖంగా అంతర్జాతీయ మీడియాలో చర్చ జరగుతోంది. రష్యా, చైనా, పాకిస్తాన్ లతో ఏ విధమైన చర్చలు జరగుతాయనే ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు భారత్ అధ్యక్షతన జరగనుంది. సదస్సు ప్రాధాన్యాలను ఎస్సీవో నూతన అధినేతగా ఉన్న దేశం ఖరారు చేస్తుంది.