ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 11న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేయనున్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, గిరిజన విశ్వవిద్యాలయం పనులకు కూడా ప్రధాని చేత మొదలు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై నిన్న విజయనగరం జిల్లా అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష కూడా నిర్వహించారు. భోగాపురం, ట్రైబల్ యూనివర్సిటీ పనులకు వచ్చే నెలలో మోడీ శ్రీకారం చుడుతున్నట్లు బొత్స వెల్లడించారు.
కాగా, విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు మోడీ హాజరు కానున్నారు. ప్రధాని టూర్ పై అధికారిక సమాచారం ఈ వారం చివర్లో రానున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.