ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమమేనని, దీనికి పార్టీలతో సంబంధం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీ గ్రౌండ్స్ లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి విజయసాయి పరిశీలించారు. ప్రధాని మొత్తం ఏడు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. మోడీ ప్రధాని హోదాలో వస్తున్నారని, దీనికి రాజకీయాలు ముడిపెట్టవద్దని విజయసాయి విజ్ఞప్తి చేశారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పుడు అన్ని పార్టీల నేతలు, అధికారులు స్వాగతం పలకడం సాధారణంగా జరుగుతుందని చెప్పారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సంబంధించి గతనెల 27న కోర్టు తీర్పు రావాల్సి ఉన్నా, జడ్జిమెంట్ రిజర్వు లో పెట్టడం వల్ల ఆ కార్యక్రమానికి ప్రధాని శంఖుస్థాపన చేసే అవకాశం లేదని చెప్పారు. రైల్వే జోన్ కు ప్రధాని శ్రీకారం చుట్టే విషయమై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. బహిరంగసభ కోసం ఆంధ్ర యూనివర్సిటీలో చెట్లు కొట్టివేస్తున్నారన్న ఆరోపణలను విజయసాయి తోసిపుచ్చారు. మొత్తం 30 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని ఒక్క చెట్టు కూడా తొలగించడం లేదన్నారు.
షుమారు 10.471 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుడతారని, ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, రాయపూర్ – విశాఖ పట్నం ఆరులేన్ల ఎకనామిక్ కారిడార్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ రీ మోడల్ లాంటివి వీటిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.