మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. శుక్రవారం అర్ధరాత్రి బిష్ణుపూర్ జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మృతులను క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు తెలిపారు. కొందరు వ్యక్తులు బఫర్ జోన్‌ను దాటి మెయిటీలు ఉండే ప్రాంతాలకు వచ్చారని, అనంతరం వారిపై కాల్పులు జరిపారని వెల్లడించారు. ఘటనా స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో భద్రతా దళాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పూర్తిగా తమ అదుపులో ఉందన్నారు.
రెండు రోజుల క్రితం బిష్ణుపూర్ జిల్లాలో సాయుధ బలగాలకు, మైటీ తెగ నిరసనకారుల మధ్య ఘర్షణలు చేలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పగటిపూట ఆంక్షలు విధించారు. మూడు నెలల క్రితం మణిపుర్‌లో రెండు తెగల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా రగులుతున్నది. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 160 మందికిపైగా మరణించారు. ఈ అల్లర్లలో వందలాది మంది గాయపడ్డారు.