తనకున్న రాజ్యంగ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం వద్ద తనను అడ్డుకున్న పోలీసులతో అయన వాగ్వాదానికి దిగారు. తనపై ఎలాంటి కేసులు లేవని, తనను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నరసరావుపేట వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడి వస్తానని, దానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏది తప్పో ఏది ఒప్పో తనకు తెలుసంటూ వ్యాఖ్యానించారు.
గుంటూరులో రమ్య కుటుంబాన్ని పరామర్శిస్తానంటే కూడా అలాగే అడ్డుకుని అరెస్టు చేశారని, గుంటూరు పోలీసులే ఇలా ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని శాంతి భద్రతల సమస్య గుంటూరులోనే ఎందుకు వస్తుందన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తాను వెళ్లివచ్చానని, అక్కడ ఏర్పడని సమస్య గుంటూరు జిల్లాలోనే ఎందుకు ఏర్పడుతుందన్నారు? అనవసరంగా ఉద్రిక్తతలు సృష్టించవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాను ధర్నా, పాదయాత్ర చేయడం లేదని, కేవలం పరామర్శ కోసమే వెళ్తున్నానని చెప్పారు. ఎమ్మెల్సీగా తన బాధ్యతలను నిర్వర్తించడానికి పోలీసుల అనుమతి దేనికని నిలదీశారు.
కాగా, పోలీసులు లోకేష్ ను అదుపులోకి తీసుకొని ఉండవల్లిలోని అయన నివాసానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.