‘సత్యం’ రాజేశ్ .. కామాక్షి భాస్కర్ల .. బాలాదిత్య ప్రధానమైన పాత్రలను పోషించిన ‘మా ఊరి పొలిమేర’ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర 2’ థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా థియేటర్ల నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ల నుంచి మాత్రమే కాదు, ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి విశేషమైన స్పందన లభిస్తూ ఉండటం విశేషం.
ఈ సినిమా ‘ఆహా’లో 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకోవడం ఒక రికార్డుగా ‘ఆహా’ టీమ్ తెలిపింది. ఆ తరువాత కూడా ఈ సినిమా జోరు అదే రేంజ్ లో కొనసాగుతోంది.ఈ సినిమా మరిన్ని అరుదైన రికార్డులను అందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ చిన్న సినిమా .. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. సత్యం రాజేశ్ – కామాక్షి భాస్కర్ల నటన నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది.
క్షుద్రవిద్యలను ఆశ్రయించిన కుటుంబంలో పుట్టిపెరిగిన హీరో, అదే మార్గంలో ముందుకు వెళతాడు. అతని భార్యకి మాత్రం అది ఇష్టం ఉండదు. ఆమె మాటను అతను ఎంతమాత్రం వినిపించుకోడు. ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఆలయంలోని ‘నిధి’ని సొంతం చేసుకోవడానికి, మరిన్ని క్షుద్రశక్తులను ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఫలితంగా ఏం జరుగుతుందనేదే కథ. బ్లాక్ మేజిక్ చుట్టూ తిరిగే ఈ కథ, బ్లాక్ బ్లాస్టర్ హిట్ కావడం అరుదైన విషయమే.