Sunday, January 19, 2025
HomeTrending Newsపొత్తుల చీలికల వైపు బిహార్ రాజకీయాలు

పొత్తుల చీలికల వైపు బిహార్ రాజకీయాలు

Political Alliance Bihar :

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతుంటే బీహార్ లో శాసనమండలి ఎన్నికలు రాజకీయ మలుపులకు దారితీస్తున్నాయి. బీహార్ లో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు 24 సీట్లకు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేది లేదని తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని రాష్ట్రీయ జనత దళ్ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఇందుకు ప్రతిగా తామేమి తక్కువ కాదన్నట్టు  కాంగ్రెస్ సొంతంగా అన్ని స్థానాల్లో తలపడుతుందని కాంగ్రెస్ బిహార్ అధ్యక్షుడు మదన్మోహన్ ఝ ప్రకటించారు. ఇప్పటివరకు మహా ఘట్భందన్ గా కొనసాగిన కాంగ్రెస్, ఆర్జెడి దోస్తీ దీంతో తెగతెంపుల వరకు వచ్చేసింది. అయితే ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయంపైనే రెండు పార్టీల పొత్తు ఆధారపడి ఉందని కాంగ్రెస్ అంటోంది.

మరోవైపు బిజెపి నేతృత్వంలోని ఎన్ డి ఏ కూటమిలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో వికాస్ శీల్ ఇన్సాన్  పార్టీ {విఐపి} పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించక పోవటంతో ఆ పార్టీ అధ్యక్షుడు  ముకేష్ సహాని బిజెపి-జేడియు పార్టీలపై గుర్రుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి బీహార్ లో హిట్లర్ పాలన సాగిస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జీతాన్ రాం మంజీ నేతృత్వంలోని హిందూస్తాన్ అవాం మోర్చా పార్టీకి కూడా ఒక్క సీటు కేటాయించలేదు. పొత్తుల్లో భాగంగా జేడియు 11 సీట్లలో పోటీ చేస్తుండగా బిజెపికి 13 దక్కాయి. బిజెపి తన ఖాతా లోంచి పశుపతి కుమార్ పరస్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కి ఒక సీటు కేటాయించింది.

బిహార్ లో రాజకీయ కలహాలు ఉత్తరప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాలపైన కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.  వచ్చే నెలాఖరు నాటికి గొడవలు ముదిరితే ఖచ్చితంగా తూర్పు యుపి లో బిజెపి కి కొంత నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.

Also Read : పంజాబ్ లో ప్రచారానికి మాయావతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్