Political Strategy In Western Uttar Pradesh :
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ తో పొత్తు ఉన్న ఎస్పి ఈసారి చిన్న పార్టీలతో జతకడుతోంది. ఇప్పటికే రాష్ట్రీయ లోక్ దళ్ , కేశవ్ దేవ్ మౌర్యకు చెందిన మహాన్ దళ్, ఓం ప్రకాశ్ రాజభార్ కు చెందిన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తో పొత్తులు ఖరారయ్యాయి. వీటితో పాటు ఎన్నికల నాటికి అమ్ ఆద్మీ పార్టీ, శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతిశీల సమాజవాది పార్టీ- లోహియా పార్టీలతో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అఖిలేష్ యాదవ్ పర్యటిస్తున్నారు. తాజాగా నిన్న(మంగళవారం) మీరట్ లో జరిగిన ఆర్.ఎల్.డి – ఎస్.పి ఉమ్మడి బహిరంగ సభ విజయవంతం కావటం ఉభయ పార్టీల్లో ఉత్సాహం నింపింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో బిజెపిని నిలువరిస్తే గెలుపు సులువు అవుతుందనే ప్రణాళికతో అఖిలేష్ –జయంత్ చౌదరి పావులు కదుపుతున్నారు. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉండటం, జాట్లు, ముస్లింలు ప్రభావ వర్గాలుగా ఉండటం ఈ కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో 71 అసెంబ్లీ సీట్లు ఉండగా పోయినసారి బిజెపి 50 సీట్లు కొల్లగొట్టింది. ఈ దఫా 30 సీట్లు సాధించాలని ఆర్.ఎల్.డి – ఎస్.పి కూటమి వ్యూహరచన చేస్తోంది. రైతుల్లో బిజెపి వ్యతిరేకత వీరికి కలిసి వస్తుందనే భరోసాలో ఉన్నారు. తమ కూటమి అధికారంలోకి రాగానే రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తామని జయంత్ చౌదరి ప్రకటించారు. ఈ నెల 23వ తేదిన అలిగడ్ లో నిర్వహించే కిసాన్ దివస్ లో రైతాంగ సమస్యల పరిష్కారానికి మార్గాలు వెల్లడిస్తామన్నారు.
Also Read : ఓటిఎస్ పై ప్రతిపక్షాల కుట్రలు: అవంతి