Saturday, January 18, 2025
HomeTrending Newsగోవా, ఉత్తరఖండ్ లో పోలింగ్ ప్రశాంతం

గోవా, ఉత్తరఖండ్ లో పోలింగ్ ప్రశాంతం

Polling In Goa Uttarakhand And Up :

రెండో దశ ఎన్నికలు జరుగుతున్న గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గోవాలో అత్యధికంగా 79 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉత్తరాఖండ్ లో 65 శాతం పోలింగ్ నమోదుకాగా ఉత్తరప్రదేశ్ లో 60.44 శాతం నమోదైంది. దేశంలోనే చిన్న రాష్ట్రమైన గోవా లో కేవలం రెండు జిల్లాలే ఉండగా రాజకీయ పార్టీలు పెద్దసంఖ్యలో పోటీ పడ్డాయి. అదే స్థాయిలో ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారు. గోవాలో సాయంత్రం అయిదు గంటలవరకు 75.29 శాతం పోలింగ్ జరిగింది. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరుగుతున్నాయి.సంగ్ కెమ్ నియోజకవర్గంలో అత్యధికంగా 88.07 శాతం ఓటింగ్ నమోదు కాగా అత్యల్పంగా వాస్కో-డ-గమ నియోజకవర్గంలో 67.63 శాతం నమోదైంది. గోవా రాష్ట్రంలో మొత్తం 301 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ శాతం పెరగటం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని రాజకీయాలు గోవాలో జరుగుతుంటాయి. అయితే బిజెపి,కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా జరగగా అమ్ ఆద్మీ పార్టీ అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ దఫా తృణముల్ కాంగ్రెస్ కూడా బరిలో నిలవటం ఆసక్తికరంగా మారింది.ఉత్తరాఖండ్ లో సాయంత్రం 5 గంటలవరకు 59.37 శాతం ఓటింగ్ నమోదైంది. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ లో మంచు కారణంగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. హరిద్వార్ జిల్లాలో అత్యధికంగా 67.58 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అల్మోర జిల్లాలో 50.65 శాతం పోలింగ్ నమోదైంది. బిజెపి తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్ర స్థాయిలో కష్టపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంమంత్రి అమిత్ షా తదితర హేమాహేమీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమించారు. బిజెపి – కాంగ్రెస్ ల మధ్య పోరు జరుగుతుండగా అమ్ ఆద్మీ పార్టీ ఈ దఫా సీరియస్ గా రంగంలోకి దిగటంతో ఎవరికీ మేలు చేస్తుందో చూడాలి.


ఉత్తరప్రదేశ్ లో సాయంత్రం 5 గంటల వరకు 60.44 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశ జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో ఈ దఫా 55 నియోజకవర్గాల్లో రాంపూర్, సంభల్,బరేలి,బదావ్, మొరదాబాద్, బిజ్నోర్, సహారాన్ పూర్, షాజహన్ పూర్ జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. అమ్రోహ జిల్లాలో అత్యధికంగా 66.15 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా షాజహాన్ పూర్ జిల్లాలో 55.20 శాతం నమోదైంది. రెండో దశలో సమాజవాది పార్టీకి పట్టు ఉన్న జిల్లాలు ఉండగా వీటిలో అత్యధికంగా ముస్లిం జనాభా ఉండటం, జాట్ కులస్తులు కూడా ప్రభావ శీలంగా ఉండటం అఖిలేష్ యాదవ్ కు కలిసి వచ్చే అంశం. అయితే ట్రిపుల్ తలాక్ చట్టంతో చదువుకున్న ముస్లిం మహిళలు, యువతులు బిజెపి వైపు మొగ్గు చూపుతారని, నిశబ్ద ఓటింగ్ తమకు కలిసి వస్తుందని కమలనాథులు ఆశతో ఉన్నారు.


అటు బదావ్ జిల్లాలోని శేక్పూర్ నియోజకవర్గంలో రెండు గ్రామాల ప్రజలు పోలింగ్ బహిష్కరించారు. తమ గ్రామాల్లో కలుషిత నీరు వస్తోందని, తాగునీటి సమస్య ఏ ప్రభుత్వం పరిష్కరించటం లేదని నిరసన తెలుపుతూ నరావు, మిలాల్ నంగర గ్రామాలు ప్రజలు పోలింగ్ బహిష్కరించారు.

Also Read : మొదటి దశలో 60 శాతం పోలింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్