Thursday, November 21, 2024
HomeTrending NewsPonnala: పొన్నాల కాంగ్రెస్ ను వీడితే ఎవరికి షాక్

Ponnala: పొన్నాల కాంగ్రెస్ ను వీడితే ఎవరికి షాక్

తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? కారు ఎక్కేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.

2014లో కాంగ్రెస్ ఓటమికి ఎన్నో కారణాలు ఉండగా…అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య విధానాలతో కాంగ్రెస్ అధఃపాతాళానికి పడిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పార్టీ మారినా కాంగ్రెస్లో పట్టించుకునే వారు ఎవరు ఉన్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. పార్టీ ఓటమి తర్వాత ప్రజల్లోకి వెళ్లి పొన్నాల నిర్వహించిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి. కేవలం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించటం…అచ్చు తప్పులతో పత్రికా ప్రకటన విడుదల చేయటం…పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాల్లో సభా వేదికలు అలంకరించటం తప్పితే ఇంకా ఏం చేశారని అనుచర వర్గంలోనే అంటున్నారు.

ఏనాడు సొంతంగా ప్రజాందోళన కార్యక్రమాలు నిర్వహించలేదు. ys రాజశేఖర్ రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ముగ్గురు సిఎంలతో కలిసి మంత్రివర్గంలో పదవులు చేపట్టారు. తెలంగాణ వచ్చాక మొదటి పిసిసి అధ్యక్షుడిగా పార్టీని ప్రజల్లో నిలబెట్ట లేకపోయారు.

ఢిల్లీలో గోడు చెప్పుకుందామని వెళితే…పది రోజులు వేచి చూసినా రాహుల గాంధి, కేసి వేణుగోపాల్ తదితరులు ఎవరు అనుమతి ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. పదేళ్లుగా పార్టీ కార్యాచరణలో….ప్రజల్లోకి వెళ్ళటంలో అలసత్వం వహించి…ఎన్నికలు రాగానే ఢిల్లీ నాయకులను కలవాలని ప్రయత్నాలు చేస్తే… ఎలా పని జరుగుతుంది.

 పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై స్పందించిన TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, Courtesy-TV9

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…మీడియాతో మాట్లాడుతూ పొన్నాలతో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు. కేటిఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే పొన్నాల గులాబీ దండుతో జతకట్టడం ఖాయమని తేలింది. జనగాం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలపటం లేదా ఎమ్మెల్సీ హామీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

జనగామలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగే అవకాశాలు తక్కువే…సిఎం కెసిఆర్ కు సన్నిహితుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించటం అంత సులువైన పని కాదు. అయితే పల్లా ఎమ్మెల్సీ పదవి రాబోయే కాలంలో పొన్నాలకు ఇవ్వొచ్చు.

పొన్నాలతో బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు ఇప్పటికే సమాలోచనలు చేయాగా…పొన్నాలతో రెండు రోజుల ముందు దాసోజు శ్రవణ్ భేటి అయ్యారని మీడియాలో వస్తోంది. పొన్నాల జతకలిస్తే మున్నూరు కాపుల్లో గులాబీ మరింత వికసిస్తుందని భావిస్తున్నారు.

కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతండటంతో పొన్నాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొన్నాల రాకతో కారు ఫుల్ కావటం తప్పితే… ఒరిగేది ఏమి లేదని జనగామ గులాబీ నేతలు పెదవి విరుస్తున్నారు. పైగా కాంగ్రెస్ గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉంటాయని సెలవిస్తున్నారు.

పొన్నాల పార్టీని వీడితే కాంగ్రెస్ కు షాక్ అని మీడియాలో కొందరు అంటున్నారు. తాజా పరిణామాల ప్రకారం పొన్నాల బీఆర్ ఎస్ లో చేరితే కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

Also Read: Left Parties: తెలంగాణలో కాంగ్రెస్ వామపక్షాల దోస్తీ..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్