సిఎం కెసిఆర్ విధానాలు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్రలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి కదం తొక్కారు. పాదయాత్ర రెండో రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి పొన్నం కు వివరించారు. సమస్యల్ని వివరిస్తూ రాసిన లేఖను పొన్నం ప్రభాకర్ కు అందచేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పొన్నం భరోసా ఇచ్చారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా సమస్యలే ఎజెండాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేపట్టినట్టు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిఎం కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు.
126 కిలోమీటర్లు కొనసాగే పొన్నం పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. దారి పొడవునా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రారంభమై హన్మకొండ జిల్లా ఎలుకతుర్తిలో పాదయాత్ర ముగియనుంది.
Also Read : సిఎం హామీలు నీటి మూటలు పొన్నం విమర్శ