85 years old couple launched Hair Oil with 50 Herbs
బాలకృష్ణుని మొహం మీద చింతకాయల్లా వంకర్లు తిరిగిన వెంట్రుకల గురించి అన్నమయ్య చిన్ని శిశువు కీర్తనలో ‘తోయంపు కురుల తోడ తూగేటి శిరసు – చింతకాయల వంటి జడగముల తోడ’ అన్నా…
ఓ వాలుజడా! మల్లె పూల జడా! ఓ పాము జడా! సత్యభామ జడా! అని తెలుగు సినిమా పాట తలచుకున్నా…అన్నీ కురులగురించే.
జుట్టు తక్కువున్న వారి కష్టాలగురించి సినిమాలే తీస్తున్నారంటే జుట్టుకిచ్చే ప్రాముఖ్యం అర్థమవుతుంది. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే జుట్టు ఊడుతుంటుంది. దానిగురించే జుట్టు పీక్కుని మరీ ఆలోచిస్తూ ఉన్న నాలుగు వెంట్రుకలూ నష్టపోయేవారికీ లోటు లేదు.
కోవిడ్ కారణంగా బ్యూటీ పార్లర్లు మూత పడ్డాయనే మాట ఎంత నిజమో గానీ జుట్టు రాలే సమస్యలతో ట్రీట్ మెంట్స్ కోసం పరుగెడుతున్నవారు ఎక్కువని పరిశీలనల్లో తెలుస్తోంది. గతంలో కారణం తెలిసేది కాదు. ఇప్పుడు అన్నిటికీ కోవిడ్ అంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ తగ్గినవారిలో జుట్టు విపరీతంగా ఊడిపోతోందిట.
ఆయా మందుల తాలూకు పరిణామాలు, ఆందోళన, ఆహారంలో మార్పులు, హార్మోన్ల మార్పులు… ఇలా కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్లే జుట్టు ఊడిపోటానికీనూ. మొత్తంమీద గతంతో పోలిస్తే 60 శాతం సమస్య పెరిగిందని, మహిళల్లో మరీ ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. దాంతో అమాంతం జుట్టు పెరగడానికి తోడ్పడే ఉత్పత్తుల అమ్మకాలు పెరిగిపోయాయట. అంతే కాదు, రకరకాల ట్రీట్ మెంట్స్ కోసం బ్యూటీ పార్లర్లు, నిపుణుల వద్దకు పరుగు పెడుతున్నారట. దొరికింది ఛాన్స్ అని వాళ్ళు కూడా రకరకాల టెక్నాలజీలు, థెరపీలతో ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సమస్యకు సహజ వనరులతో చక్కటి పరిష్కారం వెతికాడో పెద్దాయన.
ఆయన రూటే సపరేటు, సూరత్ కు చెందిన రాధాకృష్ణ చౌదరి వయసు 85. చాన్నాళ్లు వ్యాపారం చేసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకరోజు ఆయన కూతురు జుట్టు బాగా ఊడిపోతోందని బాధపడింది. దాంతో కారణాలు తెలుసుకుందామని ఇంటర్నెట్ శోధించిన నానాజీ కి చాలా కారణాలు తెలిశాయి. ఆసక్తి పెరిగి మరికాస్త లోతుగా పరిశీలించారు.
పురుషులు, మహిళల్లో జుట్టు రాలడానికి, బట్టతలకు కారణాలు వెతికారు. జుట్టు ఊడకుండా సహాయపడే ఉత్పత్తులు, మూలికలు, నూనెలు గమనించి 50 మూలికలు, పలు నూనెలు వాడి హెయిర్ ఆయిల్ తయారుచేశారు. ఈ శ్రమలో భార్య శకుంతల సహకారం చాలా ఉంది. ముందుగా తాను తయారుచేసిన నూనె తనపైనే ప్రయోగించుకున్నారు. ఆయన బట్టతలపైనా వెంట్రుకలు వచ్చాయి. అప్పుడు బంధువులు, మిత్రులకు వాడమని ఇచ్చారు. చక్కటి ఫలితాలు రావడంతో ‘అవిమీ హెర్బల్స్ ‘ పేరిట మార్కెటింగ్ ప్రారంభించారు.
ప్రస్తుతం ఒక హెయిర్ ఆయిల్, హెయిర్ స్ప్రే తో పాటు నొప్పులు తగ్గించే నూనె కూడా అమ్ముతున్నారు. వీటికి చక్కటి ఆదరణ రావడంతో వ్యాపారం మరింత విస్తరించాలనుకుంటున్నారు.
వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు ఆయిల్ తయారు చేసే ఆలోచనా ఉంది. పార్లర్ల వెంట తిరిగి రసాయనాల సాయం తీసుకునే కన్నా ఈ మూలికా వైద్యం మెరుగే కదా!
-కె. శోభ
Also Read:
Also Read:
Also Read: