తెలంగాణకు కరెంట్ గండం ముంచుకొస్తోంది. 13 రాష్ట్రాలతో పవర్ ట్రేడింగ్‌ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సర్కార్ ఆధీనంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంచలన ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లోని 27 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పవర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని ఆదేశించింది. దీంతో ఆన్ లైన్ లో పవర్ కొనుగోలు చేసే అవకాశం కోల్పోయింది తెలంగాణ. కరెంట్ భారీగా తగ్గడంతో కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలో కరెంట్ సమస్య వచ్చే అవకాశం ఉండటంతో.. ఈ అంశంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేసీఆర్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.. రాష్ట్రంలో కరెంట్ కోతలు తప్పవనే సంకేతం ఇచ్చారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పవర్ పర్చేస్ జరపకుండా ఆదేశాలు ఇవ్వడం దారుణమని ప్రభాకర్ రావు అన్నారు. కేంద్ర సర్కార్ నిర్ణయంతో 20 మిలియన్ యూనిట్స్ డ్రా చేయలేకుండా పోయామన్నారు. కేంద్రం ఇలా ఎందుకు చేసిందో అర్ధం కావడం లేదన్నారు. 13 వందల 60 కోట్ల రూపాయలు కట్టినా ఇలా చేయడం బాధాకరమన్నారు. అందుబాటులో ఉన్న పవర్ తోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. వర్షాలు బాగా పడడంతో జల విద్యుత్ ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.
థర్మల్, హైడల్, సోలార్ పవర్ జనరేషన్ ఆశించిన స్థాయిలో ఉండటంతో శుక్రవారం 12 వేల 214 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎక్కడా అంతరాయం రాకుండా సరఫరా చేశామని ప్రభాకర్ రావు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా అంతరాయం వస్తే తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రానున్నరోజుల్లో విద్యుత్ సరఫరా లో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉందన్నారు. ఉదయం, సాయంత్రం రైతులు పంపు సెట్లు ఎక్కువగా రన్ చేస్తారు కాబట్టి.. డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ సమయంలోనే సమస్యలు రావొచ్చని.. కరెంట్ కోతలు విధించాల్సి వచ్చినా తమకు సహకరించాలని ప్రభాకర్ రావు విన్నవించారు.
Also Read : తెలంగాణలో కరెంట్ బంద్