పాకిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పీపీపీ, పీఎంఎల్-ఎన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ (72) తిరిగి ప్రధానమంత్రి పదవి చేపడతారు. పీపీపీ కో-చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ (68) దేశాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఈ మేరకు పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వెల్లడించారు.
పీపీపీ, పీఎంఎల్-ఎన్ సంకీర్ణ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందొ ప్రజలు ఇప్పటికే చూశారు. వీరి హయంలోనే నిత్యావసరాలు, చమురు ధరలు అమాంతం పెరిగాయి. పౌర ప్రభుత్వం వచ్చినా ప్రజల్లో నిర్లిప్తత తొలగటం లేదు. పేరుకే ప్రభుత్వాలని అంతా మిలిటరీ కనుసన్నల్లోనే జరుగుతుందని నిర్వేదంగా మాట్లాడుతున్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజలు తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే ఆర్మీ అధికారులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్భణం అదుపు కాకపోవటంతో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయి.
బలూచిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు బలపడుతున్నాయి. భారత్ తో రాకపోకలకు అనుమతించాలని ఆక్రమిత కాశ్మీర్, బాల్టిస్తాన్ లో ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి. తమ ప్రాంతంలో ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారని, తమ దగ్గరే విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా నిత్యం కరెంటు కోతలని మండిపడుతున్నారు. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైనికులు కనిపిస్తే దాడులు చేసే పరిస్థితి నెలకొంది.
సింద్, ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల విడుదల జరగటం లేదని…ప్రభుత్వ యంత్రాంగం పంజాబ్ అభివృద్ధి కోసమే పనిచేస్తోందనే అసంతృప్తి హింసగా మారుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ కార్యకలాపాలు ఆ దేశ ప్రభుత్వానికి సవాల్ గా మారాయి.
గతంలో ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో భారత్ పట్ల పెడసరిగా వ్యవహరించారు. ఎన్నికల్లో లబ్ది కోసం భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించినా ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల సమయంలో భారత్ పై ఆరోపణలు చేయటం పరిపాటిగా మారిందని రాజకీయ నాయకుల వైఖరిని ప్రజలు తప్పుపడుతున్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం అదుపులోకి రావాలంటే భారతదేశంతో వ్యాపార సంబంధాలు పునరుద్దరించాలని పౌర సంఘాలు, ప్రజలు, మేధావుల నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ e ఇన్సాఫ్ పార్టీ బ్యాట్ గుర్తు రద్దు చేయటం… ఆ పార్టీ అగ్రనేతల నామినేషన్లు తిరస్కరించటం…ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా PTI అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినా సరే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండేందుకే మొగ్గు చూపటంతో…PMLN-PPP కూటమికి అవకాశం వచ్చింది.
ఈ దఫా ఎన్నికల్లో అనేకచోట్ల అక్రమాలు జరిగాయని…సింద్ రాష్ట్రంలో ఏకంగా ఒక PMLN సభ్యుడు రాజీనామా చేయటం కలకలం సృష్టించింది. ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించినా అది నామమాత్రమే అని న్యాయకోవిదులు పెదవి విరుస్తున్నారు. అటు ఎన్నికల అక్రమాలపై వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
పొరుగు దేశాలతో సంబంధాలు కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ తో సత్సంబంధాలు నెలకొల్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చైనాతో స్నేహం దేశ భవిష్యత్తుకు మంచిది కాదని పాక్ మేధావులు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు.
ఇన్ని రకాల ఒత్తిడుల మధ్య అధికారం చేపతుడున్న PMLN-PPP కూటమి… తమ పాలనలో నూతన శకం ప్రారంభం అవుతుందని దేశప్రజలకు భరోసా ఇస్తున్నారు. పూర్తి మెజారిటీ రాకపోవటంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తెరవెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తారని… ఆయన నిర్ణయాలే ప్రభుత్వానికి శిరోధార్యం అనే వాదనలు ఉన్నాయి. దేశంలో నెలకొన్న వివిధ రకాల సంక్షోభాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి అధికారం ముళ్ళ కిరీటమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-దేశవేని భాస్కర్