Friday, September 20, 2024
HomeTrending Newsయుపిలో బిజెపికి దడ పుట్టిస్తున్న మహిళా అభ్యర్థులు

యుపిలో బిజెపికి దడ పుట్టిస్తున్న మహిళా అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలిచి ఢిల్లీ గద్దె ఎక్కేందుకు బిజెపి… అబ్ కి బార్ చార్ సౌ పార్ నినాదంతో దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. అత్యధిక స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లో మరిన్ని సీట్లు గెలుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 సీట్లు ఉండగా 2019 ఎన్నికల్లో బిజెపి- 62, బీ.ఎస్.పి- 10, ఎస్పి-05, అప్నాదల్-02 సీట్లు గెలిచాయి.

ఇప్పటికే మొదటి దశలో పశ్చిమ యుపిలోని 8 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలిసి 80 సీట్లు గెలుచుకోవాలని కమలం నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. సర్వేల్లో బిజెపి 70 సీట్లు గెలుచుకుంటుందని వార్తలు వస్తున్నా అది వాస్తవం కాదని క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే అర్థం అవుతోంది. సమాజ్ వాది పార్టీ నుంచి బిజెపి గట్టి పోటీ ఎదుర్కొంటోందని సమాచారం. బిఎస్పి ఒక స్థానంలో ఆరు స్థానాల్లో సమాజ్ వాది పార్టీ నుంచి బిజెపి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఆ ఏడు సీట్లలో మహిళా అభ్యర్థులు ఉండటం గమనార్హం.

మైన్ పురిలో ఎస్పి నుంచి పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. 1996 నుంచి ఈ నియోజకవర్గం సమాజ్ వాది కంచుకోటగా ఉంది. ములాయం కుటుంబ సభ్యుల్లో ఎవరు నిలబడినా విజయం వారిదే. బిజెపి ఆవిర్భవించాక ఖాతా ప్రారంభించని నియోజకవర్గాల్లో మైన్ పురి ఒకటి. ఈ నియోజకవర్గంలో కమలం పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.

గొండ లోక్ సభ స్థానం నుంచి SP తరపున శ్రేయ వర్మ పోటీ చేస్తున్నారు. ఈమె కుటుంబం మొదటి నుంచి ఎస్పిలో కీలక పాత్ర పోషించింది. మాజీ మంత్రి బెని ప్రసాద్ వర్మ మనవరాలు, మాజీ మంత్రి రాకేశ్ వర్మ కుమార్తె శ్రేయ వర్మ. యువ నాయకురాలిగా ఎన్నికల బరిలోకి మొదటిసారి దిగిన శ్రేయ నియోజకవర్గంలో విరివిగా ప్రచారం చేస్తున్నారు. బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపి కీర్తి వర్ధన్ సింగ్ తలపడుతున్నారు.

గోరఖ్ పూర్ లోక్ సభ స్థానం యుపిలో ప్రత్యేకం. సిఎం యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. బిజెపి సిట్టింగ్ ఎంపి రవి కిషన్ ఎస్పి నుంచి ఈ దఫా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎస్పి నుంచి కాజల్ నిషాద్ పోటీ చేస్తున్నారు. రవి కిసహ్న్ ప్రముఖ బొజ్ పురి నటుడు కాగా కాజల్ కూడా బుల్లితెర నటి. నిషాద్ సామాజిక వర్గం మెజారిటీగా ఉండే ఈ నియోజకవర్గంలో గోరఖ్ నాథ్ మఠం ప్రాబల్యం అధికంగా ఉంటుంది. యోగి పోటీ చేసినపుడు సహకరించిన నిషాద్ లు ఒకసారి బిజెపికే అవకాశం ఇచ్చారు.

ఈ దఫా బిజెపి ఇక్కడ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని సమాచారం. సిఎం యోగి చరిష్మా తప్పితే.. ఎంపిగా గెలిచిన రవికిషన్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదనే అపవాదు ఉంది. గోరఖ్ పూర్ మేయర్ గా పోటీ చేసిన కాజల్ నిషాద్ ను చండీఘడ్ తరహాలో బిజెపి ఓడించిందని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో మెజారిటీగా ఉండే మత్స్యకార సామాజికవర్గం నిషాద్ లు తమ అభ్యర్థినే గెలిపించాలని పట్టుదలగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఉన్నవ్ నియోజకవర్గం నుంచి అన్ను టాండన్ తలపడుతున్నారు. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన అన్ను టాండన్ ఇప్పుడు ఎస్పి టికెట్ మీద పోటీ చేస్తున్నారు. రెండు సార్లు ఓడిపోయిన అన్ను.. బిజెపి సిట్టింగ్ ఎంపి సాక్షి మహారాజ్ కు వ్యతిరేకంగా ప్రచారంలో నిమగ్నం అయ్యారు. సాక్షి మహారాజ్ హ్యాట్రిక్ కొట్టకుండా అన్ను  అడ్డుకుంటుందని ప్రచారం జరుగుతోంది.

కైరాన నియోజకవర్గంలో ఎస్పి నుంచి ఇక్రా హసన్ పోటీ చేస్తున్నారు. 2022 శాసనసభ ఎన్నికల్లో ఇక్రా సోదరుడు నహీద్ హసన్ వివిధ ఆరోపణలపై జైలుకు వెళ్ళటంతో ఆయన తరపున ప్రచారం నిర్వ్హహించిన ఇక్రా సమర్థవంతంగా పార్టీ శ్రేణులను సమన్వయపరిచింది. ఇక్రా సమర్థత గుర్తించిన అఖిలేష్ ఆమెకు అవకాశం ఇచ్చారు.

బిజెపి విధానాలు సూటిగా ప్రశ్నించే ఇక్రాకు కైరానలో ఆదరణ పెరుగుతోంది. గతంలో తన తల్లి తబస్సుం హసన్, తండ్రి మునవర్ హసన్ వారసత్వం కొనసాగింపుగా మళ్ళీ జయకేతనం ఎగురవేయాలని ఉవ్విల్లూరుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపి ప్రదీప్ చౌదరి… సిఎం యోగి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తున్నారు.

హర్దోయి నుంచి ఎస్పి అభ్యర్థిగా ఉషా వర్మ తలపడుతున్నారు. 2004, 2009లో ఇక్కడి నుంచి వరుసగా గెలిచిన ఉష వర్మ 2014, 2019లో ఓడిపోయారు. దీనికి తోడు ప్రస్తుత ఎంపి ఓం ప్రకాష్ రావత్ పై ప్రజలలో వ్యతిరేకత ఉందని బిజెపి అభ్యర్థిని మారిస్తే ఫలితం ఉండేదంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, సానుభూతి ఓట్లతో ఉష వర్మ గట్టెక్కుతుందని సమాచారం.

వీటితోపాటు జాన్పూర్ లో బీ.ఎస్.పి నుంచి శ్రీకళా రెడ్డి సింగ్ పోటీచేస్తున్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకళా యుపికి చెందిన ధనుజయ్ సింగ్ ను పెళ్లి చేసుకునారు. బిఎస్పి అధినేత్రి మాయావతికి సన్నిహితుడిగా పేరున్న ధనుంజయ్ సింగ్ వివిధ కేసుల్లో జైలులో ఉండటంతో శ్రీకళ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడ బిజెపి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. సిట్టింగ్ ఎంపి శ్యాం సింగ్ యాదవ్ బదులుగా ఈ దఫా శ్రీకళ రెడ్డి తలపడుతున్నారు. బిజెపి నుంచి మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్‌ కుష్వాహా బరిలోకి దిగారు.

ఇలా యుపిలోని కొన్ని నియోజకవర్గాల్లో బలమైన మహిళా ప్రత్యర్థులను బిజెపి డీ కొంటోంది. మహిళా అభ్యర్థులపై బిజెపి నుంచి అందరు పురుష అభ్యర్థులే పోటీ చేయటం గమనార్హం. జాన్పూర్, మైన్ పూర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో బిజెపి ఎంపిలు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయా స్థానాలను ఈసారి నిలబెట్టుకోవటం కమలదళానికి ప్రతిష్టాత్మకంగా మారిందని విశ్లేషణ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్