Friday, November 22, 2024
Homeసినిమాప్రపంచ మార్కెట్ ను ఆక్రమించిన ప్రభాస్

ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించిన ప్రభాస్

తెలుగు తెరపై నట వారసత్వం కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ .. అక్కినేని ..  కృష్ణ .. ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు. వాళ్లంతా కూడా స్టార్ హీరోలుగా తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ఆయన సోదరుడి తనయుడైన ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చాడు. 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యాడు. జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా ఆడలేదు. కానీ రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి కుర్రాడు హీరోగా రావాలో .. అలాంటి కుర్రాడే వచ్చాడని అంతా అనుకున్నారు.

ప్రభాస్ .. హైటూ .. పర్సనాలిటీ .. డైలాగ్ డెలివరీ .. వాయిస్  ఇవన్నీ చూసి, ఒక మాస్ హీరోకి ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అనుకున్నారు. యాక్షన్ సినిమాలకి పనికి రావొచ్చుననే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. ఆ తరువాత వచ్చిన ‘రాఘవేంద్ర’ సినిమాతో ఆ అభిప్రాయాలు బలపడ్డాయి కూడా. కానీ ఆ తరువాత వచ్చిన ‘వర్షం’ సినిమా చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. యాక్షన్ తో పాటు లవ్ .. రొమాన్స్ .. ఎమోషనల్  సీన్స్ లో ఆయన చెలరేగిపోయాడు. కథాకథనాలు ..  పాటలు బాక్సాఫీస్ దగ్గర బంగారం పండించాయి. ఈ సినిమాతో ప్రభాస్ కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది. 

Prabhas

కృష్ణంరాజు మాదిరిగానే ఈ కుర్రాడు యాక్షన్ ను .. ఎమోషన్ ను అద్భుతంగా పండిస్తున్నాడనే టాక్, ‘ఛత్రపతి’ సినిమాతో బలపడిపోయింది. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి ఆయనను మరింత చేరువ చేసింది. అలా ఆ తరువాత చేసిన ‘పౌర్ణమి’ పెద్దగా ఆడకపోయినా, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రభాస్ ను కనెక్ట్ చేసింది. అలా ప్రభాస్ అందరివాడు అనిపించుకున్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ వరుస పరాజయాలను ఎదుర్కున్నాడు. అయితే ‘వర్షం’ .. ‘ఛత్రపతి’ తెచ్చిన క్రేజ్ ముందు ఆ పరాజయాల ప్రభావం అంతగా పనిచేయలేదు.

‘మిస్టర్ పర్ఫెక్ట్’ .. ‘మిర్చి’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టాయి. యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఆయన స్థానాన్ని మరింత పదిలం చేశాయి. అలాంటి పరిస్థితుల్లోనే ‘బాహుబలి’ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు తెరపైనే ‘బాహుబలి’ ఒక అద్భుతమైన ఆవిష్కరణగా నిలిచింది. అప్పటివరకు తాము  చూసిన ప్రభాస్ వేరు .. ఈ ప్రభాస్ వేరు అనుకున్నారు. ఆ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించుకోలేకమని చెప్పుకున్నారు. ఈ ఒక్క సినిమా ఆయనను ప్రపంచపటానికి పరిచయం చేసింది.

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మంత్రమై మ్రోగింది. సంచలన విజయానికి సరికొత్త అర్థం  చెప్పిన ఈ సినిమా, ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. సాధారణంగా దక్షిణాదిన ఎవరి మార్కెట్ వారి పరిధిని బట్టి ఉంటుంది. అందువలన ఇక్కడి కథలను జాతీయ స్థాయిలో మార్కెట్ ఉన్న హిందీ హీరోలు రీమేక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోలతో సమానంగా ప్రభాస్ సినిమాలు వివిధ భాషల్లో విడుదలవుతున్నాయి. బాలీవుడ్ సంస్థలు సైతం ఆయనతో సినిమాలు చేయడానికి ముచ్చటపడుతున్నాయి, ఉత్సాహపడుతున్నాయి.

త్వరలో ప్రభాస్ నుంచి రానున్న ‘రాధే శ్యామ్’ .. మాస్ మసాలా యాక్షన్ తో రూపొందుతున్న ‘సలార్’ .. భారీ పౌరాణిక చిత్రంగా నిర్మితమవుతున్న ‘ఆది పురుష్’ ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఆ తరువాత నాగ్ అశ్విన్  తో చేయనున్న ‘ప్రాజెక్టు K’ ..  సందీప్ వంగాతో చేయనున్న ‘స్పిరిట్’ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించనున్నవే. చాలా తక్కువ సమయంలో .. చాలా తక్కువ సినిమాలతో ప్రభాస్ ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించాడు. ప్రభాస్ సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ .. వేల కోట్ల బిజినెస్ అన్నట్టుగా మారిపోయింది. 

చూడటానికి ప్రభాస్ పైకి చాలా రఫ్ గా కనిపిస్తాడు గానీ, ఆయన మనసు చాలా సున్నితమని సన్నిహితులు చెబుతుంటారు. ఇక ప్రభాస్ కి తెలిసింది ప్రేమించడమేనని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతారు. సెట్లో స్టార్స్ తో ఆయన ఎంత అభిమానంతో ఉంటాడో .. లైట్ బాయ్స్ తో కూడా అంతే అభిమానంతో ఉంటాడని చెబుతారు. సెట్లోకి వస్తూనే చిన్నవాళ్ల దగ్గర నుంచి .. పెద్దవాళ్ల వరకూ ఆప్యాయంగా పలకరించడం ఆయనకి అలవాటు. ప్రపంచమంతా ప్రశంసిస్తున్నా, తన పని తాను తాపీగా చేసుకుంటూ వెళ్లడమే ప్రభాస్ ప్రత్యేకతగా కనిపిస్తుంది. తెలుగు కథానాయకుడిని ఎవరెస్టు ఎత్తుకు తీసుకెళ్లిన ప్రభాస్ పుట్టినరోజు ఈ రోజు (అక్టోబర్ 23). ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

(ప్రభాస్ బర్త్ డే స్పెషల్)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్