రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. నాడు ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్రతో జగన్ పాదయాత్ర చేపట్టారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ నుంచి ప్రారంభమై 3648 కిలోమీటర్లపాటు కొనసాగి 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను తిరగరాస్తూ 175కు 151 సీట్లు గెల్చుకుని అధికారంలోకి వచ్చింది. మే 30 న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున పాల్గొని కేక్ కట్ చేశారు.