Monday, January 20, 2025
HomeTrending Newsబాబుతో పీకే భేటీ!

బాబుతో పీకే భేటీ!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) నేడు ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి నారా లోకేష్ తో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పీకే నేరుగా బాబు నివాసానికి చేరుకున్నారు.

ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) పేరుతో  రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు అందించే ఓ సంస్థను నడుపుతోన్న ప్రశాంత్ కిశోర్  గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పీకే టీమ్ లో ఉన్న రాబిన్ శర్మ ఆ తర్వాత సొంతంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పటికే పని చేస్తున్నారు. చంద్రబాబు నిర్వహించిన అనేక కార్యక్రమాలతో పాటు లోకేష్ ఇటీవలే పూర్తి చేసిన యువ గళం పాదయాత్రకు కూడా రాబిన్ శర్మ బృందం వ్యూహాలు రూపొందించింది. మరోవైపు ఐప్యాక్ లోని కొంతమంది సభ్యులు వైఎస్సార్సీపీతో కలిసి ఇంకా పని చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో న్యాయవాదులతో సంప్రదింపుల కోసం దాదాపు నెలరోజులపాటు ఢిల్లీలో ఉన్న లోకేష్ ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఉండవల్లి నివాసంలో నిన్న శుక్రవారం నుంచి మూడు రోజుల శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హెూమం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే పీకెతో బాబు భేటీ ఏర్పాటు చేయడం గమనార్హం. పీకే వచ్చిన సమయంలో రాబిన్ శర్మ టీమ్ కూడా బాబు నివాసంలోనే ఉన్నట్లు టిడిపి వర్గాలు ధ్రువీకరించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్