టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్‘. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో నాగ్ ఆలోచనలో పడ్డారని.. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని వార్తలు వచ్చాయి.
నాగ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన మూవీ ‘శివ’. ఈ సంచలన చిత్రం విడుదల రోజైన ‘అక్టోబర్ 5’ను ‘ది ఘోస్ట్’ కోసం లాక్ చేశారు మేకర్స్. అయితే.. చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ కూడా అదే రోజున థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. చిరంజీవితో తనకున్న అనుబంధంతో సినిమా విడుదలను నాగ్ స్వయంగా మార్చారని పుకార్లు పుట్టుకొచ్చాయి. రెండ్రోజుల తర్వాతా అక్టోబర్ 7న విడుదలవుతుందని వార్తలు వచ్చాయి.
రిలీజ్ విషయమై అక్కినేని అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లారిటీ ఇచ్చారు. డేట్ మారిందనే వార్తలు నిజం కాదని.. ముందుగా ప్లాన్ చేసినట్లుగా విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీనే ది ఘోస్ట్ విడుదల అవుతుందని స్పష్టం చేశారు.
Also Read: ది ఘోస్ట్ నుండి నాగార్జున బర్త్ డే స్పెషల్ పోస్టర్