Major reshuffle: మంత్రివర్గంలో మెజార్టీ మార్పులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈసారి పునర్ వ్యవస్థీకరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్ద పీట వేసే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా చెప్పారు. మొత్తం మార్పులపైనా సిఎం జగన్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారని, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తారని సజ్జల చెప్పారు.
కొత్త జిల్లాలపై కసరత్తు పూర్తయిందని, ఎప్పుడైనా నోటిఫికేషన్ రావొచ్చని సజ్జల చెప్పారు. వికేంద్రీకరణ దిశగా తమ ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రిక ఘట్టమని అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందని, పార్లమెంట్ కేంద్రాల ఆధారంగా జిల్లాలు ఏర్పాటవుతాయని వివరించారు. గతంలో విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ లో చిన్న చిన్న మార్పులతోనే తుది నోటిఫికేషన్ ఉంటుందన్నారు. 90 శాతం కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఉంటాయన్నారు. 2023 నాటికి అన్ని కొత్త జిల్లాల్లో శాశ్వత భవనాల నిర్మాణం పూర్తవుతుందన్నారు.
అమరావతి నిర్మాణంపై కూడా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి నిధులే ప్రధాన అడ్డంకి అని పేర్కొన్నారు. డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయాలనడం సాధ్యమయ్యే విషయమేనా అని ప్రశ్నించారు. అభివృద్ధికోసం ఎకరానికి 2 కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని సిఎం చెప్పిన విషయాని సజ్జల గుర్తు చేశారు. ఒక ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎలా అని, అయినా లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు.
Also Read : ఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన?