Sunday, January 19, 2025
HomeTrending Newsవైద్యం వికటించి గర్భిణీ మృతి

వైద్యం వికటించి గర్భిణీ మృతి

పీర్జాదిగూడలోని కౌండిన్య ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఆ తల్లికి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మూడో కాన్పులోనైనా మగబిడ్డ పుట్టాలని ఆమె కుటుంబం ఆశించింది.ఎవరి సలహా,ఒత్తిడి మేరకో లింగ నిర్ధారణకు వెళ్లగా.. మళ్లీ ఆడ బిడ్డేనని వైద్యులు నిర్ధారించారు.ఏ పరిస్థితుల్లో ఆ తల్లి ఒప్పుకుందో గానీ.. అబార్షన్‌ చేస్తుండగా వైద్యం వికటించి గర్భిణీ కన్నుమూసింది.ఈ క్రమంలో గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రి యాజమాన్యం,సిబ్బంది అక్కడినుంచి పరారయ్యారు.ఈ దారుణ సంఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.విషయం బయటకు పొక్కడంతో వైద్యుల కోసం అక్కడ గాలిస్తుండగా ఐదు నెలల ఆడబిడ్డ మృతదేహం కనిపించడం అందరి హృదయాలను కలచివేసింది.బాధితులు,కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం..

సంగారెడ్డి జిల్లా కేంద్రం రాఘవేంద్రనగర్‌ కాలానికి చెందిన కొత్తగడి ప్రవీణ్‌,కవిత(35) దంపతులకు తొమ్మిదేండ్ల కిందట వివాహం జరిగింది.వీరికి 8,5 ఏండ్ల వయస్సు కలిగిన ఇద్దరు ఆడపిల్లలున్నారు.ప్రస్తుతం కవిత ఐదు నెలల గర్భిణీ కావడంతో హయత్‌నగర్‌లోని పుట్టింటికి వచ్చింది.శనివారం ఆమెకు స్వల్ప రక్తస్రావం కావడంతో హయత్‌నగర్‌ మండలం తిమ్మాయిగూడెం గౌరవేల్లిలోని RMP డాక్టర్‌ నిరుపా సలహా మేరకు పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని కౌండిన్య ఆస్పత్రిలో చికిత్స కోసమని అడ్మిట్‌ చేశారు.ఆదివారం ఉదయం ICU నుంచి జనరల్‌ వార్డుకు షిఫ్ట్‌ చేసిన అనంతరం ఆస్పత్రి సిబ్బంది,వైద్యుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన మృతురాలి తల్లి జనరల్‌ వార్డుకు వెళ్లి చూడగా బెడ్‌పై పేషెంట్‌ విగత జీవిగా పడి ఉంది.వైద్యులు వచ్చి పరీక్షించగా కవిత అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.కాగా..అప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్న ఆ దంపతులు లింగనిర్ధారణ పరీక్షల అనంతరం మరోసారి ఆడపిల్లే అని తేలడంతో అబార్షన్‌ చేయించుకోవడం వల్లనే కవితా మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది.ఆపరేషన్‌ వికటించడంతో ఈ దారుణఘటన చోటుకున్నట్టు తెలుస్తోంది.సంఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడిపల్లి CI గోవర్ధన్‌ గిరి అధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.
ఆస్పత్రి యాజమాన్యం పరార్‌.!

బాధితులు స్థానిక మేడిపల్లి PS కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా ఆస్పత్రిలో ఏ ఒక్కరూ కూడా అందుబాటులో లేకపోవడంతో జిల్లా వైద్యాధికారి,జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు.దాంతో ఆస్పత్రికి చేరుకున్న మేడ్చల్‌ జిల్లా డిప్యూటీ వైద్యాధికారి నూక నారాయణ రావు,ఏరియా మెడికల్‌ అఫీసర్‌ ప్రతిభ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు.మృతి చెందిన పేషెంట్‌ బెడ్‌ పక్కనే ఐదు నెలల మృత శిశువు లభించడం కలకలం రేపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్