Sunday, October 6, 2024

రామాయణం-7

Mandhara: ఎప్పుడో త్రేతాయుగంలో అయోధ్యలో కైకేయి అంతఃపురంలో దాసిగా ఉండిన మంథర చాలా క్రూరంగా వ్యవహరించి…చాడీలు చెప్పి…ద్వేషం నూరిపోసి…కైకేయి మనసు విరిచి…అలక పాన్పు ఎక్కించి…సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్లేలా చేసిందని…అరవై వేల ఏళ్లు నిర్నిరోధంగా అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పరిపాలించిన దశరథమహారాజు స్పృహదప్పి పడి…ఆ నిస్పృహలోనే శాశ్వత నిద్రలోకి జారుకోవడానికి కారణమయ్యిందని యుగయుగాలుగా చెప్పుకుంటున్నాం. అప్పుడు ఒకతే మంథర. ఇప్పుడు వీధికొకరు. ఇంటికొకరు.

అత్తాకోడళ్ల మధ్య మంథరలు; తండ్రీ కొడుకుల మధ్య మంథరలు; అన్నదమ్ముల మధ్య మంథరలు… చిన్న మంథరలు, పెద్ద మంథరలు, మగ మంథరలు...అడుగడుగునా మంథరలే. కాకపొతే త్రేతాయుగం మంథరకు గూని. నడుము లేవదు. ఎప్పుడూ ఊతకర్ర చేతిలో పెట్టుకుని తిరిగేది. కలియుగం మంథరలు, మంథరులకు గూని ఉండదు. చేతిలో కర్ర ఉండదు కాబట్టి వెంటనే పోల్చుకోలేము. ఆ మంథర ఒక లోకోపకారానికి, దైవ కార్యానికి సాధనమన్నా అయ్యింది. ఇప్పటి మంథరల మాటలకు కొంపలు కూలడం, అడవుల పాలై అరణ్యరోదన మిగలడం తప్ప- లోకానికి ఉపద్రవం తప్ప- లోకోపకారం ఏమీ ఉండదు.

లేనిపోనివి చెప్పే మంథర నోళ్లు ఉన్నప్పుడు…లేనిపోని నానా చెత్త వినే కైకేయి చెవులు కూడా తప్పనిసరిగా ఉంటాయి.

రామాయణంలో మంథర పొట్టిది. గూనికి తోడు వికారమైన మొహం. అందాన్ని చూసి ఓర్వలేదు. ఎదుటివారు ఆనందంగా ఉంటే తట్టుకోలేదు. కైకేయి పుట్టింటి నుండి అయోధ్యకు వచ్చిన వందల మంది దాసీ జనంలో ఒకామె.

మరుసటి రోజు ఉదయం శ్రీరాముడి పట్టాభిషేకం అని తెలిసి అయోధ్య పొంగిపోతోంది. మేళతాళాల ధ్వనులు మిన్ను ముట్టాయి. రాత్రి దీపాలతో తళతళలాడుతోంది. ప్రతి ఇంటి గుమ్మానికి అరటి స్తంభాలు. ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలు. వీధుల్లో పూల ముగ్గులు. ఒక అందమైన కొత్త రుతువేదో అప్పటికప్పుడు విచ్చి…పరిమళించి…గజ్జెకట్టి నాట్యం చేస్తున్నట్లు ఉంది.

కైకేయి నివాసముండే అంతఃపురంలో మెట్లెక్కుతూ కిటికిలోనుండి అయోధ్య నగరం రంగును, పొంగును, హంగును చూసింది మంథర. అదే కిటికిలోనుండి పొరుగున కౌసల్యా దేవి అంతఃపురం అద్దుకున్న కొత్త శోభను కూడా కళ్లారా చూసింది. ఏమిటి ఈ హడావుడి? ఎందుకీ అలంకారాలు? అని అటు వెళుతున్న చెలికత్తెను అడిగింది. రేపు సూర్యోదయం కాగానే శ్రీరాముడి పట్టాభిషేకం. ఇంత పెద్ద వార్త నీకు తెలియదా? అంటూ వెళ్ళిపోయింది ఆమె.

అదేమిటి? నాకీ విషయం ఇంతదాకా ఎందుకు తెలియలేదు? అని గుండెలు బాదుకుంటూ కైకేయి అభ్యంతర మందిరంలోకి వెళ్లింది.  “నీ కొంప కొల్లేరు అవుతుంటే…నీ జీవితంలో నిప్పులు కురుస్తుంటే…నువ్విక్కడ హాయిగా హంస తూలికా తల్పం మీద పడుకున్నావా? మూర్ఖురాలా!”

“ఏమి జరిగిందని అంతలేసి మాటలంటున్నావు?” అని తాపీగా అడిగింది కైకేయి.

“నీ భర్త నిన్ను మాయలో పెట్టి…అక్కడ రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు…” అని చెబుతుండగానే…

నా రాముడికి పట్టాభిషేకమా! ఆహా! ఎంత తీయటి కబురు చెప్పావు!” అంటూ పరుపు మీదినుండి ఒక్క ఉదుటున లేచి...ఇదిగో నువ్ తెచ్చిన వార్తకు బహుమతిగా ఈ హారం తీసుకో అని తన మెడలో నుండి తీసి మంథర మెడలో వేసింది కైకేయి. ఆ హారాన్ని తీసి తెంపి…విసిరి వేసింది. ముత్యాలు మందిరమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. కైకేయికి కోపం కట్టలు తెంచుకుంది. ఏమిటీ చేష్టలు? అని గద్దించి అడిగింది.

రాముడు రాజైతే కౌసల్య రాజమాత. నువ్వు కౌసల్యకు గొడుగు పట్టాలి. నీ కొడుకు భరతుడు రాముడికి గొడుగు పట్టాలి. మేమంతా వారి సేవకులకు సేవలు చేస్తూ అనామకంగా బతకాలి” అని జరగబోయే దృశ్యాలను చెబుతోంది.

“రాముడు సకల గుణ సంపన్నుడు. కౌసల్యను ఎలా చూస్తాడో! నన్నూ అలాగే చూస్తాడు. రాముడి తరువాత భరతుడు రాజవుతాడు…” అని రాముడి గొప్పతనాన్ని మైమరచి చెబుతోంది.

“పిచ్చిదానా! నీ తెలివి తెల్లవారినట్లే ఉంది. రాముడి తరువాత రాముడి కొడుకు రాజవుతాడు కానీ…భరతుడు ఎందుకవుతాడు? నువ్వు, నీ భరతుడు దిక్కులేక వారి పంచన పడి ఉండాలి. లేదా అడవులు పట్టుకుని పోవాలి. కొంచెం బుర్ర ఉపయోగించు. ఇదంతా కౌసల్యా దశరథులు రహస్యంగా పన్నిన కుట్ర. అందుకే విషయం బయటికి పొక్కకుండా రాత్రికి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు. ముద్దుల భార్య అంటూ నీ వెంటపడే దశరథుడు కనీసం నీకు విషయం చెప్పకుండా దాచాడు అంటేనే ఇందులో కుట్ర తెలిసిపోతోంది కదా?” అని ఏ విషయాలను గుదిగుచ్చి చెబితే కైకేయి మనసు విసుగుతుందో అవన్నీ చెప్పింది.

“అంతేనంటావా? అయితే మన బతుకు బుగ్గిపాలేనా? అయితే ఏమి చెయ్యాలంటావు ఇప్పుడు!” అని దీనంగా అడిగింది.

హమ్మయ్య! జీవి పూర్తీ మన అదుపులోకి వచ్చింది అని అనుకుని మిగతా కథకు కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే అయ్యింది మంథర.

కైకేయి అలకపాన్పు; దశరథుడు ఏనాడో ఇచ్చిన రెండు వరాలను- 1 . భరతుడికి పట్టాభిషేకం, 2 . రాముడికి పద్నాలుగేళ్ల వనవాసంగా అడిగించడం; దశరథుడు కాదనలేక కుమిలిపోవడం; ఊళ్లో లేని భరతుడికి ఇది తెలియకపోవడం, రాముడు మారుమాట మాట్లాడకుండా సంతోషంగా ఒప్పుకోవడం; ఉదయాన్నే రాముడు వనవాసానికి వెళ్లడం; ఏడ్చి ఏడ్చి ఆ రాత్రికే దశరథుడి ప్రాణాలు పోవడం…మిగతా కథ అంతా తెలిసిందే.

భరతుడు మేనమామ కేకయ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చేసరికి తండ్రి శవమై ఉన్నాడు. అన్నా వదినలు లేరు. లక్ష్మణుడు లేడు. మందిరాల్లో నైరాశ్యం. నిశ్శబ్దం. కళాకాంతుల్లేవు. జరిగింది తెలిసింది. ఎంతపని చేశావు తల్లీ! అని తల్లిమీద కోప్పడ్డాడు. మంథర మీద కత్తిదూసి…అన్న రామన్న ఆజ్ఞలేదని నిభాయించుకున్నాడు. కౌసల్య కాళ్ళమీద పడి క్షమించమని అడిగాడు. తండ్రి అంత్య క్రియలు కాగానే అడవికి వెళ్లి…ఖాళీగా ఉన్న అయోధ్య సింహాసనం అధిష్ఠించాల్సిందిగా రమ్మన్నాడు. అన్న రానన్నాడు. అన్న పాదుకలను తెచ్చి ఆయన పేరిట పద్నాలుగేళ్లు ఒక సంరక్షకుడిగా రాజ్యాన్ని చూసుకుంటూ…తానూ నారచీరలు కట్టుకుని దీక్షలో ఉన్నాడు.

తరువాత మంథర ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. మొత్తం రామాయణాన్ని మలుపు తిప్పి… వెళ్ళిపోయింది. ఆమె అడిగించినట్లు భరతుడు రాజు కాలేదు. కైకేయి రాజమాత కాకపోగా ఆమె నుదుటి కుంకుమను చెరిపేసింది. పచ్చటి సంసారంలో నిప్పులు పోసింది.

పచ్చటి సంసారాల్లో చెప్పుడు మాటల నిప్పులు పోసే మంథరలు ఇప్పుడు లేరా?
చాడీలకు చెవులిచ్చి…అలక పాన్పులెక్కే కైకేయిలు ఇప్పుడు లేరా? ఎప్పటెప్పటి విషయాలనో అకారణంగా తవ్వి ఇప్పుడు నట్టింట్లో అగ్గికి ఆజ్యం పోస్తూ బూడిద మిగుల్చుకునే కైకేయిల్లేరా?

భవిష్యత్తులో మంథరలకు దూరంగా ఉండమని చెప్పడానికే వాల్మీకి మహర్షి ఆ సన్నివేశంలో మంథర- కైకేయి మాటలను పొల్లుపోకుండా రికార్డు చేసి పెట్టాడు.

రేపు- రామాయణం-8
“ఒకడు గుహుడు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్