భారత- జమైకా ల మధ్య సమాచార, సాంకేతిక, ఫార్మ, విద్య, పర్యాటకం, క్రీడా రంగాల్లో కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్రపతి రామ్ నాతో కోవింద్ అభిప్రాయపడ్డారు. జమైకా గవర్నర్ జనరల్ సర్ పాట్రిక్ అలెన్ తో సమావేశమైన రాష్ట్రపతి రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. కరీబియన్ దేశమైన జమైకాను భారత రాష్ట్రపతి సందర్శించటం ఇదే మొదటి సారి కాగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ జమైకాలో పర్యటిస్తున్నారు. జమైకా పర్యటనలో రెండో రోజు భారత రాష్ట్రపతి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాజధాని కింగ్ స్టన్ లోని డౌన్ టౌన్ లో ఈ రోజు (మంగళవారం) బాబాసాహేబ్ అంబేద్కర్ పేరుతో నిర్మించిన `అంబెదర్ అవెన్యూ’ రోడ్డును ప్రారంభించిన కోవింద్ ఆ తర్వాత జమైకా- భారత్ స్నేహానికి గుర్తుగా నిర్మించిన ఇండియా జమైకా ఫ్రెండ్ షిప్ గార్డెన్‌ను ప్రారంభించారు. నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారం జమైకా చేరుకున్న భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు రాజధాని కింగ్‌స్టన్ విమానాశ్రయంలో ఆ దేశ అధినేతతో పాటు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జమైకాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కావడం విశేషం. ప్రవాస భారతీయులతో సమావేశమైన రాష్ట్రపతి వారి జీవన శైలి, స్థానికులతో సంబంధాలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రపతితో పాటు ఆయన భార్య సవితా కోవింద్, కూతురు స్వాతి కోవింద్, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి, లోక్‌సభ ఎంపీలు రమా దేవి, సతీష్ కుమార్ గౌతమ్‌లతో పాటు సెక్రెటరీ స్థాయి అధికారులు కొందరు వెళ్లారు. జమైకా గవర్నర్ జనరల్ పాట్రిక్ అల్లెన్, ప్రధాని ఆండ్రూ హోల్ నెస్, కేబినెట్ సభ్యులు, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్, పోలీస్ కమిషనర్ స్వయంగా కింగ్‌స్టన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి కోవింద్‌కు స్వాగతం పలికారు. బుధ, గురువారాల్లో మరిన్ని కార్యక్రమాల్లో కోవింద్ పాల్గొని భారత్‌కు తిరిగి రానున్నారు.