Farm Laws to be Repealed:
కేంద్రం నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నదా?
అవును. దేశ ప్రధాని ప్రకటించిన దాని ప్రకారం ఆ సాగు చట్టాలు రద్దు కాబోతున్నాయి.
మన దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం.
దేశంలో సగం జనాభా ప్రత్యక్షంగా… మిగిలిన సగంలో సగం పరోక్షంగా… వ్యవసాయం మీదే ఆధారపడి బతికి బట్టకడుతున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటి పోయాయి.
17 సార్లు పార్లమెంట్ కు ఎన్నికలు జరిగి కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
ప్రతి ప్రభుత్వం ఏర్పడగానే మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అనే చెబుతుంది.
రైతులకోసం ఎన్నో కార్యక్రమాలు, పథకాలు.. వచ్చాయి, పోయాయి.
లక్షల కోట్ల ప్రజాధనం రైతుల సంక్షేమం పేరుతో.. ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి.
కొత్తగా భూమి సాగులోకి వచ్చింది.. ఉత్పాదకత పెరిగింది..
కానీ  ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుల శ్రమకు తగ్గ ఫలం మాత్రం దక్కడం లేదు..
రైతు పండించిన పంటను కొని మార్కెట్ లో అమ్ముకొనే దళారులు, వ్యాపారస్తులు, పంటలను ప్రాసెస్ చేసి, వాటి నుంచి ఇతర ఆహార ఉత్పత్తులు
తయారు చేసే కంపెనీలు మాత్రం కోట్లకు పడగలెత్తాయి.

కాని రైతు ఆర్ధిక స్థితిగతులు మాత్రం చాలీచాలకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు.
ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజిలు, రుణమాఫీలు, పథకాలు…. రైతుకు బ్రతికి సాధించాలనే మనోధైర్యం ఇవ్వలేకపోతున్నాయి.
రైతు గుండె ఎందుకు పగులుతోంది? .. ఆలోచించే నాయకుడే లేడు.
అధికార పక్షం, ప్రతిపక్షం..మీరేమి చేశారంటూ ఒకరినొకరు నిందించుకోవడం తప్ప నిజంగా రైతులకు మనమేమి చేయాలని ఆలోచించడం లేదనేది నిష్ఠుర సత్యం.

17 సెప్టెంబర్ 2020 న మోడీ ప్రభుత్వం రైతుల మేలు కోసం అంటూ మూడు కొత్త సాగు చట్టాలు తెచ్చింది.
రైతులకు నిజమైన స్వాతంత్ర్యం ఈరోజే వచ్చిందని ప్రకటించింది.
ఇక రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకోవచ్చని, తన ఇష్టం ఉన్న చోట అమ్ముకోవచ్చని,  రాష్ట్రాల సరిహద్దులు, దేశ సరిహద్దులు కూడా దాటి మార్కెట్ చేసుకోవచ్చని ప్రకటించింది.
రైతు పంట పండక ముందే కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని పంట పండించవచ్చని,
లేదంటే తన వ్యవసాయం మొత్తం వారికే అప్పచెప్పవచ్చు అని చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు రైతుకు కొద్దో, గొప్పో దారిదీపంలా ఉంటే దానికి చట్టంలో చోటు లేదు.
ఈ చట్టాల అమలు తరువాత కనీస మద్దతు ధర ఉంటుందా, ఎరువుల సబ్సిడీ ఉంటుందా.. సమాధానం లేదు.
అసలు ఈ చట్టాలు తెచ్చేముందు రాష్ట్రాలతో సంప్రదింపులు లేవు
దేశం మొత్తం రైతుల జీవితాలను ప్రభావితం చేసే విషయాల మీద,  ముందు వెనుకలు, లాభ నష్టాలు గురించి ఆలోచన లేకుండానే  చట్టం చేసి పారేశారు.
రైతులతో చర్చలేదు. రాష్ట్ర శాసనసభల్లో చర్చ లేదు. కనీసం పార్లమెంట్ లో ఆరోగ్యకరమైన, అవసరమైన చర్చ లేదు. మందబలంతో చట్టాలు చేసి రైతులపై రుద్దారు.
సహజంగానే రైతులు భయపడ్డారు.

కార్పొరేట్ లతో రైతుకు తేడా వస్తే.. నిర్ణయం కలెక్టర్ చేతిలోఉండడం, కలెక్టర్లు ప్రభుత్వ అధినేతలకు, ప్రభుత్వాధినేతలు కార్పొరేట్ శక్తులకు ‘డూడూ బసవన్న’ లుగా ఉంటారనే జగమెరిగిన సత్యం  రైతుకు తెలుసు కాబట్టి.. నిర్ణయం ఎవరికి అనుకూలంగా జరుగుతుందో పెద్దగా ఊహించాల్సిన అవసరం లేకుండానే రైతుకు అర్ధం అయ్యింది.  చట్టాలను వెనక్కు తీసుకోవాలని పట్టుబట్టాడు.
ఈ చట్టాలు అమలు అయితే నిజంగా రైతులకు మేలు చేస్తాయా, లేదా అనే నిఖార్సైన చర్చ ఎక్కడా లేదు.
ఇంత కీలక చట్టాల విషయంలో కూడా బీజేపి పాలిత రాష్ట్రాలు చట్టాలకు అనుకూలంగా , ప్రతిపక్షాల పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి.
రైతు ప్రయోజనం కంటే రాజకీయ ప్రయోజనాల గురించే ఆలోచించాయి.
నెలల తరబడి ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరపమని సుప్రీమ్ కోర్ట్ సూచించినా..
అటువైపు ప్రభుత్వం నుంచి నిజాయతితో కూడిన స్పందన లేదు.
ఇటు ఉద్యమం చేస్తున్న రైతు నాయకుల నుంచి కూడా నిజాయతితో కూడిన స్పందన లేదు.
ముందు చట్టాల చిచ్చు పెట్టింది కేంద్రమే కాబట్టి పెద్దన్నలా చట్టాలను వెనక్కు తీసుకొని.. చర్చలు మొదలు పెట్టాలని రైతు నాయకులు, చట్టం పట్ల మీకున్న అపోహలు తీరుస్తామంటూ కేంద్రం.. గత సంవత్సరంగా  తూ..తూ మంత్రపు చర్చలతో  కాలం వెళ్ళదీశాయి.
ఈ ఉద్యమ ప్రకంపనలు విదేశాల దాక పాకాయి.
సంవత్సరకాలంగా ఇరు పక్షాలు ‘పట్టు జారకుండా’ ప్రతిఘటిస్తూనే ఉన్నాయి.

ఏమో! ఏమైందో! అకస్మాతుగా మోడీ గారికి జ్ఞానోదయం అయ్యింది.
పంతాలు, పట్టింపులు వదిలేసి.. నూతన సాగుచట్టాలను వెనక్కు తీసుకొంటామని ప్రకటించారు.
చాల హుందాగా రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. దీనికి నిజంగా మోడీ కు అభినందనలు చెప్పవలసిందే.
చట్టాలను వెనక్కుతీసుకొంటున్నామని ఏ కేంద్ర మంత్రో చెబితే సరిపోయినా,
ప్రధానిగా తానే ప్రకటించి క్షమాపణ చెప్పడం భావి రాజకీయాలకు ఆదర్శం కావాలి.
ప్రతిపక్షాలు ఇది మా విజయమే అని జబ్బలుచరుచుకొన్నా..
మోడీ అహంకారం వదిలిన్చామని చెప్పుకున్నా…..

నిజానికి ఇది రైతు విజయం. ప్రజాస్వామ్య విజయం.
అవును.. చట్టాలు చేసే మేలు, కీడును పక్కన బెడితే.. ఈ చట్టాలు మన రాజ్యాంగం ప్రవచించే పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా రూపొందినవి కావి కాబట్టి  వీటిని కేంద్రం వెనక్కు తీసుకోవడం.. 

ఇది నిజంగా ప్రజాస్వామ్య విజయం. రాజ్యాంగ విజయం. 

జై కిసాన్..

– శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read :

 

రైతు చట్టాలు రద్దు: మోడీ ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *