Sai Kumar Shanmukha Priya Felicitated By It Department :
ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ సాయికుమార్‌ను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేశ ప్రధాని నరేంధ్రమోడి నేతృత్వంలో 2021 మార్చి 12న ప్రారంభమై 2022 ఆగస్టు 15 వరకు 75వారాల పాటు జరిగే కార్యక్రమమే ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీ శాఖవారు అనేక రంగాల్లో లబ్దప్రతిష్ఠులైన కొంత మందిని ఎంపికచేసి సత్కరించారు. తోలుబొమ్మలాట కళాకారులు పద్మశ్రీ దాలవాయి చలపతిరావు, నటుడు సాయికుమార్, గాయని షణ్ముఖప్రియలను సన్మానించారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ “సంస్కారం అమ్మది, స్వరం నాన్నది, అనుగ్రహం కళామతల్లిది. అభిమానం మీ అందరిది. నేను రీల్ హీరో అయితే.. నన్ను అభిమానించే అభిమానులే రియల్ హీరోలు. భారతీయులుగా పుట్టడం మనందరి అదృష్టం. ఈ వేదిక పై సన్మానించిన చలపతిరావు గారు పదో ఏట, సింగర్ షణ్ముణప్రియ ఐదో ఏట, నా నట ప్రయాణం పదకొండో ఏట ప్రారంభమవ్వటం ఈ వేడుకలో యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు. నా ముందుతరానికి చెందిన చలపతిరావు, నా తర్వాత తరం షణ్ముణను అలాగే నా తరానికి ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసి ఇంత గొప్ప సభలో సన్మానించటాన్ని గౌరవంగా, కించిత్ గర్వంగా భావిస్తున్నా. ఇంతటి గొప్ప కార్యక్రమానికి కారణమైన తెలుగు రాష్ట్రాల ఐటీ డిపార్ట్ మెంట్ చీఫ్ కమిషనర్ అతుల్ ప్రణయ్ కు కృతజ్ఞతలు’’ అన్నారు.
Also Read : గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.