Friday, October 18, 2024
HomeTrending Newsభారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల యూరోప్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులు రష్యా, ఒక రోజు ఆస్ట్రియాలో పర్యటించిన మోడీ వివిధ అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ దేశాలకు భారత వైఖరిని తేటతెల్లం చేశాడని చెప్పవచ్చు. రెండు రోజుల రష్యా పర్యటనలో ప్రధాని మోడీ – రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విస్త్రృత చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడి ముందు ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత విధానాన్ని పంచుకున్నారు. రష్యా భారత్ మిత్ర దేశమని స్పష్టత ఇస్తూనే… ఉక్రెయిన్ తో యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని భారత్ విధానాన్ని వెల్లడించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా తన సైన్యంలో నియమించుకొన్న భారతీయులను విముక్తి కల్పించేందుకు, వారిని వీలైనంత త్వరగా భారత్‌ పంపేందుకు అంగీకారం కుదిరింది. రష్యా సైన్యంలో 35 నుంచి 50 మంధి భారతీయలు పనిచేస్తుండొచ్చని విదేశాంగ శాఖ అంచనా. ఇప్పటికే 10 మంది భారత్‌కు వచ్చేశారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ తెలిపారు.

22వ భారత్‌ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మాస్కోలోని ప్రవాస భారతీయులతో సంభాషించారు. భారత- రష్యాల మధ్య అధికారికంగా రాయబారులు ఉన్నా.. నిజమైన రాయబారులు ఇరు దేశాల ప్రజలని మోడీ రెండు దేశాల సంబంధాలను నిర్వచించారు.

మాస్కో పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఆస్ట్రియా పయనమయ్యారు. ఆ దేశ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌తో భేటీ లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్‌ సంక్షోభాలు చర్చకు రాగా, ఇది యుద్ధానికి సమయం కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ – రష్యా శాంతి ప్రక్రియలో భారత్‌ ప్రభావవంతమైన పాత్ర పోషించగలదని ఆస్ట్రియన్‌ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌ అన్నారు. అదే సమయంలో తమ దేశం తటస్థ విధానాన్ని అవలంబిస్తుందన్నారు.

భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి. 1983లో చివరిసారిగా ఇందిరా గాంధీ ఆ దేశాన్ని సందర్శించారు. ఇందిరా గాంధీ తర్వాత ఆ దేశంలో పర్యటించిన రెండో ప్రధానిగా మోడీ నిలిచారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు ప్రారంభమై 75 ఏండ్లు పూర్తయ్యాయని ఆస్ట్రియన్‌ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశం-ఈయు(european Union)సంబంధాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వేగవంతంపై చర్చ జరిగింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్‌లు, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు రెండు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించేందుకు సాంస్కృతిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలు కీలకమైన అంశాలుగా నేతలు గుర్తించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్