ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ రోజు అమెరికా పయనమయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్వేతా సౌధంలో 24వ తేదిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో నరేంద్ర మోడీ సమావేశం అవుతారు. కోవిడ్ పర్యవసానాలు, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా వెల్లడించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతంపై నేతలు చర్చించనున్నారు. జో బైడేన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నరేంద్రమోడి మొదటిసారి అమెరికా పర్యటన, ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశంపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఉన్నారు.
అదే రోజు ప్రధాన మంత్రి క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా సభ్య దేశాలుగా క్వాడ్ కూటమి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం, పొరుగు దేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై క్వాడ్ కూటమి చర్చిచనుంది. కూటమి నేతలు కోవిడ్ నేపథ్యంలో ఇన్నాళ్ళు వర్చువల్ సమావేశాలకే పరిమితం అయ్యారు. మొదటి సారిగా నాలుగు దేశాల నేతలు ముఖాముఖి సమావేశం కానున్నారు. చైనా నీతి మాలిన విధానాల్ని కట్టడి చేయటమే చేయటమే లక్ష్యంగా క్వాడ్ కూటమి ఏర్పడింది.
న్యూయార్క్ లో 25వ తేదిన జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నేపథ్యంలో యుఎన్ 76 వ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మహమ్మారి విస్తరణకు కారణంగా భావిస్తున్న చైనా నిర్లక్ష్యంపై సమావేశంలో ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది.
నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో జో బైడెన్ తో సమావేశం, క్వాడ్ కూటమి సదస్సు, ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశం, మూడు కార్యక్రమాలుగా ఉన్నా అన్నింటిలో చైనా కేంద్రంగానే చర్చలు జరిగే అవకాశం ఉంది.