తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (తెలుగుదేశం) ఇకపై శాసనసభలో తమ గళం వినిపించే అవకాశం కోల్పోతున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపుల విషయమై అచ్చెన్న, పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై విచారించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇకపై జరగబోయే సమావేశాల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆసెంబ్లీ స్పీకర్ కు, తద్వారా సభకు సిఫార్సు చేయబోతోంది. ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటి ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు.
అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రివేలేజ్ కమిటీ నేడు మరోమారు సమావేశమైంది. తమ వద్ద ఉన్న ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల విషయంలో అచ్చెన్న క్షమాపణ చెప్పినందున ఈ విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
నిమ్మగడ్డ రమేష్ మరికొంత అదనపు సమాచారం అడిగారని, అయన నుంచి వివరణ వచ్చిన తరువాత, దాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని కాకాణి చెప్పారు. కూన రవికుమార్ తనకు నోటీసు అందలేదని చెప్పారని, కానీ అయన ఉద్దేశపూర్వకంగానే కమిటీ సమావేశానికి గైర్హాజరు అవుతున్నారని. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తదుపరి భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు.