తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని జిల్లాలనూ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. యువ గళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుండ్లాపల్లి క్యాంప్ సైట్ లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో నేడు జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొని వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యావ్యవస్థను సిఎం జగన్ నాశనం చేశారని, యూపీఎస్సీ తరహాలో ఏపీ పీఎస్సీని తయారు చేస్తామని, మెగా డిఎస్సీ నిర్వహించి పెండింగ్ లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్ గా చేస్తామని, లాయర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని చెప్పారు.
ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలన నేటికీ కొనసాగుతోందని, ఈ నాలుగేళ్ళలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. అన్నివర్గాల ప్రజలూ ఈ పాలనకు బాదితులేనని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరోసారి సిఎం కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వృత్తి నిపుణులు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని అప్పుడే పాలనలో మంచి విధానాలు రావడానికి అవకాశముంటుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే టిడిపి ప్రొఫెషనల్ విభాగం ఏర్పాటు చేశామని, రాబోయే కాలంలో ప్రభుత్వంలో తాము ఏదైనా విధానం రూపొందించే ముందు ముసాయిదాను ఈ విభాగానికి పంపి అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు. తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒకప్పుడు సింగపూర్ ఐటి కంపెనీ యజమానిగా ఉండేవారని, బాబు గారు అతని ప్రతిభను గుర్తించి రాజకీయాల్లోకి ఆహ్వానించారని, ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారని వివరించారు.