రామగుండంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళనకు దిగాయి. మోడీ పర్యటనను నిరసిస్తూ ఈ రోజు పెద్దపెల్లి జిల్లా బంద్ కు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు నిర్వహించబోయే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
రామగుండంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ నేత సీతారామయ్య అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ ను హౌస్ అరెస్ట్ చేసారు. వరంగల్ లో ఏఐవైఎఫ్ నేత వలీ ఉల్లాఖాద్రీ ను అరెస్ట్ చేశారు.
మరోవైపు సింగరేణి కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాని పర్యటనను నిరసిస్తూ అన్ని కేంద్రాల్లో నిరసనలకు పిలుపు ఇచ్చింది. దీంతో ఉదయం షిఫ్ట్ కు హాజరైన కార్మికులు గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలిపి విధులకు హాజరయ్యారు. మందమర్రి నుంచి కొత్తగూడెం..సత్తుపల్లి వరకు అన్ని గనుల్లో కార్మికులు.. ప్రధాని రాకపై నిరసన తెలిపారు.